ఈ రోజుల్లో ఏదైనా రోగం వస్తే .. నగరంలో వెలిసిన బడా ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టామంటే అవసరం ఉన్నా లేకున్నా.. స్కానింగ్, బాడీ చెకప్ అని, ఈసీజీ, బ్లడ్ పరీక్షలు వంటి చేయించుకోవాలి. ఇవి తడిచి మోపెడు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూడాల్సిన పరిస్థితి. అయితే.. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయి.
వైద్యం నేడు కమర్షియల్ రంగు పులుముకుంది. చిన్న జర్వం వచ్చినా కూడా రూ. 500 కాగితాన్ని చదివించాల్సిందే. చాలీచాలని జీతంతో బతకడమే కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో ఏదైనా రోగం వస్తే .. నగరంలో వెలిసిన బడా ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టామంటే అవసరం ఉన్నా లేకున్నా.. స్కానింగ్, బాడీ చెకప్ అని, ఈసీజీ, బ్లడ్ పరీక్షలు వంటి చేయించుకోవాలి.. అదీ కూడా తమ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలని చెబుతారు. వేలల్లో రోగుల నుండి రాబడతారు. చిన్న రోగానికే ఎక్కువ మందులు రాస్తారు. అవీ కూడా వాళ్ల మెడికల్ షాపులో మాత్రమే దొరికేవీ, మరెక్కడా దొరకని మందులు రాస్తారు. దీంతో జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెల జీతం మొత్తం ఖర్చు అయిపోతుంది. ఇవన్నీ తట్టుకోలేని సామాన్యుడు ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. కానీ ఆ ఆసుపత్రుల్లోని వైద్యులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఈ నెల 20న రేణుక అనే గర్భిణీ ఈ నెల సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే నార్మల్ డెలివరీ చేయాలని భావించారు అక్కడి వైద్యులు. నొప్పులు పడుతుందని పట్టించుకోలేదు. 24 గంటలు గడిచినప్పటికీ రేణుకకు నార్మల్ డెలివరీ అవ్వలేదు. రోజంతా నొప్పులు పడటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది. దీంతో ఆమెకు హుటాహుటిన ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. శిశువును బయటకు తీశారు. అప్పటికే మగ శిశువు మృతి చెందాడు. అటు ఆమె పరిస్థితి కూడా మరింత దిగజారి పోయి.. విషమించింది. కాగా, శనివారం మధ్యాహ్నం రేణుక కూడా చికిత్స పొందుతూ మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఆమె హైబీపీ కారణంగా కార్డియాక్ అరెస్టు జరిగిందని.. దీంతో బిడ్డ, తల్లి చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు.