తణుకు బీటెక్ విద్యార్థిని నాగ హారిక సజీవ దహనం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మంచంపై నిద్రిస్తున్న ఆమె కాలి బూడిదవ్వటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగా హారిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ అల్లుడు, అతడి రెండో భార్యే నాగ హారికను హత్య చేసి, కాల్చేసినట్లు మృతురాలి అమ్మమ్మ ఆరోపిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘నా అల్లుడు శ్రీనివాసరావు బాగా చదువుకున్నాడు. ఎమ్మెస్సీ అయిపోయింది.
జాబ్ కూడా వస్తుందని మాకు తెలిసింది. కుర్రాడు మంచోడని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశా. ఒక్కత్తే కూతురు. పాపను చాలా అపురూపంగా చూసుకున్నాం. పెళ్లయిన కొన్ని నెలలు బాగానే ఉన్నాడు. నా మనవరాలు నాగ హారిక పుట్టిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. తాగుడు, పేకాటకు బానిసయ్యాడు. నాగ హారికను సరిగా చూసుకునే వాడు కాదు. తరచుగా కొట్టేవాడు. మనవారాల్ని మా దగ్గరే పెట్టుకుందాం అనుకున్నా. కానీ, కుదరలేదు. దాదాపు ఏడేళ్లుగా మాతో సంప్రదింపులు లేవు. పాపను మా దగ్గరికి తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాం. కానీ, మా అల్లుడు పట్టించుకోలేదు.
పాపను అడ్డం పెట్టుకుని మా ఆస్తిలో మూడో వంతు వాటా కొట్టేయటానికి చూశాడు. శ్రీనివాసరావు రెండో పెళ్లాం హారికను చిత్రహింసలు పెట్టేది. హారిక చనిపోయిన విషయం ఆ ఊరి పెద్ద మనిషి ద్వారా మాకు తెలిసింది. మేము వెళ్లే సరికి సజీవ దహనం అయిపోయింది. బూడిద మాత్రమే మిగిలి ఉంది. కొట్టి, చంపేసి, పెట్రోల్ పోసి అంటించేశారు. హారిక తలపై రాడ్డుతో కొట్టారు. తల వైపు నంతా రక్తం కారిపోయి ఉంది. నిద్దట్లోనే కొట్టి చంపేశారు. ప్రస్తుతం ఏలూరు కోర్టులో మూడో వాటా కేసు నడుస్తోంది. కేసు కూడా ఫైనల్‌కు వచ్చింది. ఆస్తి కోసం కూతుర్ని ప్రేమగా చూసుకున్నట్లు నటించారు. తర్వాత చంపేశారు.