భార్య దోసె వేయలేదని ఒక భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. మూడుముళ్ల బంధంలో కొత్త బాధ్యతలు, బంధుత్వాలు ఏర్పడతాయి. అప్పటివరకు ఒకలా సాగిన జీవితంలో కొత్త మార్పులు మొదలవుతాయి. కష్టసుఖాల్లో తోడుండే భాగస్వామి ఉంటే ఆ జీవితమే వేరు కదా. కానీ అన్యోన్యంగా ఉండాల్సిన జంటలు కాపురాన్ని నాశనం చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలకే గొడవలు, మనస్పర్థలతో బాధపడుతున్నారు. కొన్ని జంటల్లో అయితే భార్యాభర్తలు స్పల్ప కారణాలకే క్షణికావేశానికి లోనై పరస్పరం దాడులు కూడా చేసుకుంటున్నారు. కొత్త జంటల్లోనే కాదు పలు వృద్ధ దంపతుల విషయంలోనూ ఇలాంటివి జరుగుతుండటం గమనార్హం.
ఇలాంటి దాడుల్లో ఎక్కువగా మహిళలపై పురుషులు చేసినవే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా తమిళనాడులో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దోసె చేయలేదనే కోపంతో భర్త కత్తితో పొడవడంతో భార్య మృతి చెందింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మాత్తూరుకు దగ్గర్లోని ఎన్.మోటూరు గ్రామానికి చెందిన గణేశన్ (60) పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆకలి వేయడంతో భార్య మాధమ్మాల్ (50)ను తనకు దోసె చేయాలని అడిగాడు. దీంతో ఆమె మూడు దోసెలు వేసింది. అనంతరం ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది.
అయితే గణేశన్ మాత్రం తనకు మరో 3 దోసెలు కావాలని అడిగాడు. సిలిండర్లో గ్యాస్ అయిపోందని మాధమ్మాల్ జవాబిచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గణేశన్.. కత్తితో మాధమ్మాల్ తల, చేయి నరికేశాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, చిన్నారి తానీషా (2) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ట్రీట్మెంట్ కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. గణేశన్ను అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధమ్మాల్ సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో ఈ కేసును పోలీసులు హత్యా కేసుగా మార్చారు.