బిడ్డలను నవ మోసాలు మోసి కని.. వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది తల్లి. తాను తిన్నా తినకపోయినా సరే బిడ్డల కడుపు నింపుతుంది. వారికి చిన్న కష్టం వచ్చినా సరే విలవిల్లాడుతుంది. బిడ్డలే లోకంగా బతుకుతుంది. అయితే తమ కోసం ఇన్ని త్యాగాలు చేసిన తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కాదు కదా.. కనీసం ఇసుమంతైన జాలి చూపరు కొందరు కిరాతకులు. వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండాల్సింది పోయి.. కనీసం తిండి కూడా సరిగా పెట్టకుండా.. చిత్ర హింసలకు గురి చేసేవారు ఎందరో ఉన్నారు. ఇక మరికొందరు కసాయి సంతానం.. తల్లిదండ్రులను నిత్యం డబ్బుల కోసం పీడిస్తూ.. ఏమాత్రం జాలి, దయ లేకుండా… వృద్ధులనే కనికరం లేకుండా వారిపై దాడి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి.. ఆపై సజీవంగా పూడ్చి పెట్టాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ సంఘటన వివరాలు..
తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. సిత్తామూర్‌కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కుమార్తెలు.. ఒక కొడుకు ఉన్నారడు. అయితే గొడవల కారణంగా శక్తివేల్ భార్య.. అతడిని విడిచి పెట్టి.. పిల్లలను తీసుకుని.. పుట్టింటికి వెళ్లి ఉంటుంది. ఈ క్రమంలో శక్తివేల్ తల్లి యశోదతో కలిసి.. సిత్తామూర్‌లోనే ఉంటున్నాడు. శక్తివేల్ తండ్రి 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. అయితే శక్తివేల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో నిత్యం మద్యం తాగి వచ్చి.. తల్లితో గొడపడేవాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కుమారుడి తీరుతో భయపడిన యశోద.. ఎదురింట్లో పడుకునేది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా మంగళవారం రాత్రి పూటుగా మద్యం తాగి వచ్చిన శక్తివేల్.. ఆ మత్తులో తల్లితో మరోసారి గొడవ పడ్డాడు. ఆ తర్వాత నుంచి యశోద కనిపించలేదు. ఇరుగుపొరుగు వారు ఆమె కోసం గాలించారు. కానీ యశోద జాడలేదు. ఇక శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనక వైపు వెళ్లి పరిశీలించగా .. అక్కడ యశోద చీర కిందపడి ఉండడాన్ని గమనించారు. అనుమానంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంటి లోపలే ఉన్న శక్తివేల్ ఇరుగుపొరుగు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అతడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేయగా…తాగిన మత్తులో తల్లిపై దాడి చేశానని.. ఈ క్రమంలో ఆమె స్పృహ తప్పి పడిపోయిందని తెలిపాడు. భయంతో వెంటనే ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు వెల్లడించాడు. దాంతో స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గొయ్యిని తెరిచేలోగానే ఆమె ప్రాణాలు విడిచింది. శక్తివేల్‌ను అదుపులోకి తీసుకున్నారు.