పైన ఫొటోలో కనిపిస్తున్న జగన్, శరణ్య దంపతులు. వీరి గత నెల రోజుల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి అనంతరం జగన్ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఊహించిన దారుణం జరిగింది. అసలేం జరిగిందంటే?
అది తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కిట్టంబట్టి గ్రామం. ఇక్కడే జగన్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా టైల్స్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే జగన్ కు అవధానపట్టి పరిధిలోని తులక్కన్ కోటాయి గ్రామానికి చెందిన శరణ్య అనే యువతి పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి సినిమాలు, షికారులు అంటూ తిరిగారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు.
ఇక జగన్ ఎలాగైన శరణ్యనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ముందు వీళ్లిద్దరూ యువతి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, వారు ఒప్పుకోలేదు. అయినా సరే జగన్ యువతి తల్లిదండ్రులను ఎదురించి గత నెల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శరణ్య తండ్రి, కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోయారు. ఎలాగైన జగన్ ను హత్య చేయాలని పథకం వేశారు. ఇక ఇందులో భాగంగానే మంగళవారం రోజు జగన్ తన పని మీద కిట్టంబట్టి నుంచి కావేరి పట్నం మీదుగా వెళ్తున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న శరణ్య తండ్రి, బంధువులు కాపుకాసి జగన్ కత్తులతో నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దుండగుల దాడిలో జగన్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ భార్య శరణ్య, అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పరువు కోసం ఏకంగా ఓ అమాయక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.