ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వస్తువుల ద్వారా ప్రమాదాలు జరగటం ఎక్కువయిపోయింది. టీవీలు, స్కూటీలు, ఫ్రిజ్‌లు, వాటర్ హీటర్లు ఇలా పలు వస్తువులు షార్ట్ సర్క్యూట్ కారణంగానో ఇతర ఏ కారణంగానో మనుషుల్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కొన్ని ప్రమాదాల్లో మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా, ఓ ఫ్రిజ్ కారణంగా ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఫ్రిజ్ పేలటంతో ఇంట్లో అలుముకున్న ప్రమాదకరమైన వాయువులు వారిని బలితీసుకున్నాయి. ఈ సంఘటన తమిళనాడులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని చెంగల్పట్, ఉరప్పాకమ్ రైల్వే స్టేషన్ పక్కన ఆర్‌ఆర్ బ్రిందావన్ అనే అపార్ట్‌మెంట్ ఉంది.
ఈ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్లో గిరిజ(65) ఆమె చెల్లెలు రాధా(55), వారి బంధువు రామ్‌కుమార్(48), రామ్ కుమార్ భార్య భార్గవి(35), వారి కూతురు ఆరాధన(6) నివాసం ఉంటున్నారు. వీరంతా గత సంవత్సరం చనిపోయిన బంధువుకు నివాళులు అర్పించటానికి నవంబర్ 2న దుబాయ్‌నుంచి ఇండియా వచ్చారు. శుక్రవారం ఉదయం వారంతా గాఢ నిద్రలో ఉండగా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. నాలుగు గంటల ప్రాంతంలో ప్రమాదం కారణంగా ఫ్రిజ్ పేలిపోయింది. అయితే, ఫ్రిజ్ పేలటం వల్ల ఆ ఇంట్లో మొత్తం విపరీతమైన పొగ అలుముకుంది. నిద్రలో ఉన్న వారంతా పొగకు ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
గిరిజ, రాధ, రామ్‌కుమార్‌లు మృత్యువాతపడగా.. భార్గవి, ఆరాధన కోమాలోకి వెళ్లిపోయారు. ఆ ప్లాట్‌లోంచి పొగలు రావటం గమనించిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోని వారందరిని ఆసుపత్రికి తరలించారు. మృత్యువాతపడ్డ వారిని పోస్టుమార్టం కోసం పంపారు. మిగిలిన ఇద్దరికి అత్యవసర చికిత్స అందుతోంది. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.