మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామలను హత్య చేసిన నిందితుడు రషీద్ ను తాజాగా యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ భాగంగా కాల్చి చంపారు. ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగిన నిందితుడు చివరికి పోలీసుల చేతిలో హతమయ్యాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామలను నిందితుడు రషీద్ తీవ్రంగా గాయపరిచి 2020లో హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడు రషీద్ అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఇక తాజాగా పోలీసులు ఎట్టకేలకు రషీద్ ను ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. అసలేం జరిగిందంటే? టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్త ఆశా, మామ అశోక్ కుమార్ ఇంట్లో రషీద్ అనే వ్యక్తి 2020లో దొంగతానికి వెళ్లాడు. గమనించిన రైనా అత్తమామలు ఆ దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రషీద్ వారిద్దరిపై దాడి చేశాడు.
ఇక అడ్డుకోబోయిన రైనా బావమరిది కౌశల్ ను సైతం నిందితుడు కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆశా చికిత్స పొందుతూ మరణించింది. కౌశల్ కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి నుంచి పోలీసులు నిందితుడు రషీద్ కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే నిందితుడు రషీద్ యూపీలోని షాపూర్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో రషీద్ పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు సైతం నిందితుడు రషీద్ పై కాల్పులు జరపగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, రషీద్ అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.