నెల రోజుల క్రితమే శాంతికి, దీపక్ శర్మకు వివాహం అయింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, తర్వాతినుంచి దీపక్ తనకు బైకు కావాలని ఆమెను వేధించసాగాడు.
సమాజం సాంకేతికత పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నా.. వైవాహిక జీవితంలో మాత్రం వారికి ఇబ్బందులు తప్పటం లేదు. నూటికి 70 శాతం వివాహాల్లో మహిళలు శారీరక, మానసిక టార్చర్‌ను అనుభవిస్తున్నారు. అంతేకాదు! వరకట్న వేధింపులు తగ్గటం లేదు. ఉత్తర భారతంలో వరకట్న వేధింపుల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా, పెళ్లైన నెలకే ఓ నూతన వధువు ప్రాణాలు తీసుకుంది. భర్త బైకు పిచ్చి కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బిహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బిహార్‌లోని సుపాల్‌కు చెందిన దీపక్ శర్మకు అదే ప్రాంతానికి చెందిన శాంతి దేవికి నెల రోజుల క్రితం హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి కూతరు తరపు వారు ఇవ్వవలసిన లాంఛనాలు అన్నీ ఇచ్చేశారు. శాంతి దేవి అత్తారింట్లో అడుగుపెట్టింది. కొద్దిరోజులు దీపక్, శాంతిల కాపురం సజావుగా సాగింది. తర్వాతి నుంచి దీపక్ తన పాడు బుద్ది బయటపెట్టాడు. శాంతి దేవిని వరకట్నం కింద బైకు తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా వేధించేవాడు. మానసికంగా, శారీరకంగా ఆమెను టార్చర్ చేసేవాడు. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన శాంతి ఆశలు ఇలా ఆవిరయ్యారు. భర్త వేధింపులు ఆమె తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకుంది.
మంగళవారం ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన శాంతి ఎంతకీ బయటకు రాకపోయే సరికి అత్తింటివారికి అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు బద్దలు కొట్టారు. లోపల శాంతి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శాంతి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.