అభం, శుభం తెలియని చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నాయి. హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఎటాక్ చేయడంతో చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటన జరగక ముందే మరోటి చోటుచేసుకుంది.
వీధి కుక్కలు చిన్నారుల పాలిట యమధూతల్లా తయారువుతున్నాయి. అభం, శుభం తెలియని చిన్నారులపై మూకుమ్మడి దాడి చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇటీవల వీధి కుక్కల దాడిలో చనిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఎటాక్ చేయడంతో చనిపోయిన సంగతి విదితమే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే మెదక్ లో మరో ఘటన జరిగింది. ఇటు శ్రీకాకుళంలో 16 నెలల చిన్నారి సాత్వికపై వీధి కుక్కలు దాడి చేయడంతో పసిబిడ్డ మరణించింది. తాజాగా మరో ఘటన తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని కాజీ పేటలో చోటుచేసుకుంది. ఇందులో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. బ్రతుకు దెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుండి ఓ కుటుంబం గురువారమే ఖాజీపేటకు వచ్చింది. ఉంగరాలు అమ్ముకుని బతుకుతున్న ఈ కుటుంబం.. కాజీ పేట స్టేషన్‌కు వచ్చి.. అక్కడ సమీపంలోని రోడ్డుపై చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకుంది. వ్యాపారం చేసుకుని తిరిగి తమ రాష్ట్రానికి వెళ్లిపోవాలని భావించిన వీరి కుటుంబంలో వీధి కుక్కలు విషాదాన్ని నింపాయి. యుపి నుండి వచ్చిన ఈ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఏడేళ్ల చోటు అనే కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లగా.. చోటు బహిర్బూమికి వెళ్లిన సమయంలో వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి. ఎక్కడ పడితే అక్కడ కరవడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. రక్తమోడుతూ బాలుడు మృతి చెందాడు.
అయితే ఈ విషయం తెలియని అతడి చెల్లెలు.. లే అన్న అంటూ ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లితో పాటు తండ్రి రోదిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి మృతదేహం ఆసుపత్రిలో ఉంది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారు. రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. తాము ఆదుకుంటామని హామీనిచ్చారు. కాగా, ఈ ఘటన తర్వాత వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కళ్లు తెరిచి.. కుక్కలను పట్టే ప్రక్రియను చేపట్టారు. వరంగల్, హన్మకొండ, కాజీ పేటలో ఈ చర్యలు జరుగుతున్నాయి.