ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది వ్యక్తులు సొంత కాపురాన్ని కాదని పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఇక ఇంటితో ఆగకా.. అక్రమ సంబంధాలకు బానిసై కుటుంబాలను సైతం పక్కకు పెడుతున్నారు. కొందరైతే ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఆత్మహత్యలు, కాదంటే హత్యలకు కత్తులు నూరుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా ఏపీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సూర్యమణిపురం గ్రామం. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న పైల దేవిక (29) అనే మహిళకు ఇది వరకే రెండు పెళ్లిలు జరిగిపోయాయి. ఓ కూతురు కూడా ఉంది. ఇకపోతే ఇదే గ్రామానికి చెందిన కామేశ్వరావు అనే వ్యక్తిని దేవిక మూడేళ్ల కిందట మూడో పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరికి ఓ పాప కూడా జన్మించింది. దీంతో వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలోనే భార్య దేవికకు భర్త కామేశ్వరరావుపై అనుమానం కలిగింది.
నా భర్త పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ, నన్ను పక్కకు పెడుతున్నాడని తనలో తాను కుమిలిపోయింది. ఇక ఇదే కాకుండా భర్త పూండిలో ఓ మహిళతో కాపురం పెట్టినట్లుగా గుర్తించింది. దీంతో దేవిక భర్తపై కోపంతో రగిలిపోయింది. ఇక ఇందులో భాగంగానే దేవిక శుక్రవారం భర్త ఉంటున్న పూండికి చేరుకుని తాను సాగిస్తున్న చీకటి కాపురంపై భర్తను నిలదీసింది. దీంతో అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు. భర్త సూటి పోటి మాటలతో భరించలేకపోయిన దేవిక తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఈ నేపథ్యంలోనే భర్త బయటకు వెళ్లడం గమనించిన భార్య దేవిక.., ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోవడంతో దేవిక చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కూతురు మరణించడంతో దేవిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం దేవిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.