ఆత్మహత్య.. కారణం ఏదైనా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం నేరం. క్షణికావేశంతో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేస్తాయి. వారినే నమ్ముకున్న వాళ్లు, వారిపై ఆధారపడిన వాళ్లను రోడ్డున పడేస్తున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న కారణాలతోనూ ప్రాణాలను తీసుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల.. భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. తల్లిదండ్రుల చర్యల వల్ల ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. అమ్మా లే అంటూ ఆ పిల్లలు పెడుతున్న కేకలకు స్థానికులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ఆత్మహత్య కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఆనందపురం గ్రామానికి చెందిన గౌతమి(25) చిత్తిరి సత్యనారాయణను ప్రేమించింది. పెద్దలను ఒప్పించి వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఏడేళ్ల కుమార్తె తేజశ్విని, ఐదేళ్ల కొడుకు షణ్ముఖ నాయుడు ఉన్నారు. ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ల కాపురంలో గత రెండు నెలలుగా కొన్ని గొడవలు మొదలయ్యాయి. అయితే వీళ్ల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయని ఎవరికీ తెలియదు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గౌతమి ఫ్యానుకు ఉరివేసుకుంది. తాడుకు వేలాడుతున్న గౌతమిని చూసిన అత్త, బావ, తోడికోడళ్లు పనికి వెళ్లిన సత్యనారాయణకు చెప్పారు.
వెంటనే సత్యనారాయణ పొలం నుంచి పరుగున ఇంటికొచ్చాడు. గౌతమి తల్లిదండ్రులు కూడా ఆర్తనాధాలు చేసుకుంటూ కుమార్తెని చూసేందుకు వచ్చారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. తన భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేకే గౌతమి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అకారణంగా ఆమెతో గొడవలు పెట్టుకునేవాడని విమర్శించారు. ఆమెను హింసించేవాడని ఆరోపణలు గుప్పించారు. గౌతమి తల్లిదండ్రుల ఆరోపణలతో స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమ్మా లే అంటూ ఆ పిల్లలు ఏడుస్తుంటే స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకోవడం, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు.