సాధారణంగా ప్రజలు తమ కష్టాలు తొలగిపోవాలని దేవుళ్లకు మొక్కుతుంటారు. కొంతమంది ముడుపులు కడతారు. కష్టాలు తొలగిపోతే ముడుపులు సమర్పించుకుంటారు.. తలనీలాలు ఇస్తారు. ఎన్ని కష్టాలు పడైనా సరె తమ మొక్కులు చెల్లించుకుంటారు.
మనిషి కష్టాల్లో ఉన్నపుడు తమ కష్టాలు గట్టెక్కిస్తే ధన రూపంలో కానీ.. వస్తు రూపంలో కానీ కానుకలు సమర్పించుకుంటామని దేవుళ్లకు మొక్కుతుంటారు. ఇక తమ కష్టాలు గట్టెక్కితే తాము మొక్కుకున్న స్వామి వారి దర్శనానికి వెళ్లి కానుకలు సమర్పించుకుంటారు. అలా తన కుటుంబ కష్టాలు తీర్చిన స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన ఓ యువకుడు మృత్యు వడిలోకి చేరాడు. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ సంకేపల్లి పరుష మాండ్లలో వీరనారాయణస్వామి పరుష మహోత్సవం ఆదివారం వైభవం గా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారి మొక్కులు తీర్చుకునే క్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మొక్కు తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన ఓ యువకుడు ఎద్దుల బండి కంద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఎక్కువ రద్దీగా ఉండటంతో ఎడ్లు బెదిరిపోవడంతో అక్కడే ఉన్న అశోక్‌కుమార్ రెడ్డి అనే యువకుడు ప్రమాద వశాత్తు చక్రాల కిందపడిపోయాడు.. తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తాడిమర్రి దాడితోట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డికి ఒక్కగానొక్క కుమారుడు అశోక్ రెడ్డి. వయసు 32 సంవత్సరాలు. గత కొంత కాలంగా వ్యవసాయం లో తీవ్ర నష్టాలు రావడంతో పంటలు బాగా పండాలని వీరనారాయణస్వామికి మొక్కుకున్నారు అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో ఆదివారం స్వామి వారి మొక్కు తీర్చుకునేందుకు సంకేపల్లి పరుష మాండ్లలో వీరనారాయణస్వామి పరుష మహోత్సవం స్నేహితులతో కలిసి వేళ్లేందుకు సిద్దమయ్యాడు.
ఎద్దుల బండితో ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు చేశారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగి అశోక్ కుమార్ రెడ్డి మృతి చెందాడు. స్థానికులు 108 వాహనంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అశోక్ కుమార్ కి నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది.. భార్య సుజిత, ఏడాది వయసు ఉన్న కూతురు ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.