తులం బంగారం రూ. 55వేలు. ఇంత ధర పెట్టి ఒక తులం కొనాలంటేనే ఆలోచించాల్సిన రోజులివి. అలాంటిది పని పేరు చెప్పి ఇద్దరు మహిళలు ఏకంగా 150 తులాలు దోచుకెళ్లారు. అది కూడా సీరియళ్లలో చూపించినట్లు..ఇంట్లో ఉన్న మహిళ కళ్ళలో కారం కొట్టి దోచేశారు. తీరా చూస్తే..
20 రోజుల క్రితం ఎస్‌ఆర్ నగర్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం అందరికీ గుర్తుండే ఉంటుంది. పని చేయడానికి అని వచ్చిన ఇద్దరు మహిళలు ఆ ఇంట్లోనే ఏమి ఉన్నాయో పూర్తిగా తెలుసుకొని.. అనంతరం ఆ ఇంటిని దోచేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ చోరీకి సంబంధించి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టుకున్న వారిలో ఒకరు దొంగతనం చేసిన మహిళ ఉండగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్, ఎస్ఆర్ నగర్ పరిధిలోని శాంతి బాగ్ లైన్ లో రామ్ నారాయణ కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లో ఏప్రిల్ రెండో తేదీన సునీతా, పూజా అనే ఇద్దరు మహిళలు పనికి చేరారు. అదే రోజు ఇంటి యజమాని పని మీద బయటకు వెళ్లడంతో.. సదరు ఇద్దరు మహిళలు కలిసి ఇంట్లో ఉన్న మహిళ కళ్ళలో కారం చల్లారు. అనంతరం ఆమె కింద పడిపోగానే.. ఆ ఇంట్లో ఉన్న 150 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. దీని విలువ సుమారు రూ.60 లక్షలు. ఈ ఘటనపై పిర్యాదు అందుకున్న పోలీసులు టెక్నాలజీ, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితులను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఎటువంటి వివరాలు తీసుకోకుండా వ్యక్తులను పనిలోకి చేర్చుకోవడం వల్ల ఈ చోరి జరిగినట్లు వెల్లడించారు. ఈ చోరీ కేసులో నిందితులకు సాయం చేసిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటారని పేర్కొన్నారు. ఇంట్లో పనికి పెట్టుకునే ముందు ఆ వ్యక్తుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన నగరవాసులకు సూచించారు. పనిలోకి చేర్చుకునే ముందు వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు.. ఇలాంటి వివరాలు తెలుసుకొని.. అవి సరైనవేనా అని నిర్ధారించుకోవాలని కోరారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తాము ఎన్నోసార్లు చెప్పినా నగరవాసులు వినిపించుకోవట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటన చూశాకైనా.. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.