పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకుకట్టినట్లు వివరించినా న్యాయం కోసం కళ్లు కాయాల కాసేలా చూసే పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఫిర్యాదు చేసిన తర్వాత నెలలు, ఏళ్లుగా కేసు దర్యాప్తు, విచారణ అంటూ కాలం వెళ్లదీస్తుంటారు కొంతమంది పోలీసు అధికారులు. బాధితులకు న్యాయం చేయడంలో ఆలస్యం జరగడం అంటే ఒక విధంగా అన్యాయం చేయడమే. ఇలాంటి పరిస్థితుల్లో పక్షవాతం వచ్చి కనీసం స్టేషన్ వరకు కూడా రాలేని స్థితిలో ఉన్న ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించిన తీరు పోలీస్ వ్యవస్థకే ఆదర్శప్రాయంగా ఉంది.
తెనాలిలోని శ్యామ్‌సుందరపాలెంకు చెందిన రాంబాబు అనే వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతని కొడుకు పొలం, ఇంటిని బలవంతగా ఆక్రమించుకున్నాడు. పైగా తన పేరున మొత్తం ఆస్తి రాసివ్వమని తండ్రి అని కూడా చూడకుండా దారుణంగా కొడుతున్నాడు. ఈ విషయాన్ని రాంబాబు డైల్ యూవర్ ఎస్పీ కార్యక్రమానికి కాల్ చేసి తన కొడుకు చేస్తున్న అరాచకాన్ని ఎస్పీ విశాల్‌తో చెప్పుకున్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ వెంటనే స్థానిక ఎస్‌ఐతో మాట్లాడి 24 గంటల్లో బాధితుడి వద్దకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. బాధితుడికి తగిన న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇలా వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా, పోలీసులపై నమ్మకం కల్పిస్తున్న ఎస్పీ విశాల్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.