డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు మనుషులు. చివరికి మనుషులని చంపేందుకు కూడా వెనుకాడరు. ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళని చంపేస్తున్నారు. కన్నవాళ్ళని సైతం కడతేరుస్తున్నారు. కసాయి వాళ్ళున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపేందుకు కుట్ర పన్నాడో కసాయి కొడుకు. ఎప్పుడో ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ ఆస్తి విలువ కోట్లలో ఉందని, ఆస్తి సరిగా పంచలేదన్న నెపంతో కన్నవాళ్లనే లేపేయాలనుకున్నాడు. ఆ తర్వాత తమ్ముడితో తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను హతమార్చేందుకు కిరాయి రౌడీలతో బేరం మాట్లాడుకున్నాడు. సమాజం చీదరించుకునే ఈ ఘటన ఎక్కడో బీహార్ లోనో, మరే రాష్ట్రంలోనే జరగలేదు. మన తెలుగు రాష్ట్రంలోనే, ఏపీలోనే జరిగింది.
నెల్లూరు కావలికి చెందిన బాలకృష్ణకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు లక్ష్మీ నారాయణ. 2014లో ఇద్దరు కుమారులకు ఆస్తి పంచాడు తండ్రి. అయితే ఆ ఆస్తి విలువ ఇప్పుడు కోట్లు పలుకుతుండడంతో పెద్ద కొడుకు లక్ష్మీ నారాయణకు దుర్బుద్ధి పుట్టింది. ముందు తల్లిదండ్రులని చంపేసి.. తర్వాత తమ్ముడితో తేల్చుకుందాం అని కుట్ర పన్నాడు. తల్లిదండ్రులను చంపేందుకు కిరాయి గూండాలకు సుపారీ మాట్లాడాడు. మొదట కావలికి చెందిన సుబ్బారావు, షఫీ అనే ఇద్దరు కిరాయి గూండాలతో మాట్లాడాడు.
మరి డబ్బులు ఎక్కువ అడిగారో ఏమో గానీ తర్వాత ముత్తుకూరుకు చెందిన కిరాయి హంతకులు గౌస్ బాషా, షాహుల్ తో డీల్ కుదుర్చుకున్నాడు. తండ్రిని చంపితే 3 లక్షలు, తండ్రితో పాటు తల్లిని కూడా చంపితే 5 లక్షలు ఇస్తానని చెప్పాడు లక్ష్మీ నారాయణ. తల్లిందండ్రులను హతమార్చేందుకు కిరాయి గూండాలు రెండు సార్లు రెక్కీ నిర్వహించారు. అయితే కిరాయి ముఠా పోలీసులకు దొరకడంతో కుట్ర బయటపడింది. దీంతో తల్లిదండ్రుల హత్య కుట్ర భగ్నమైంది. ఈ హత్యలో హస్తం ఉన్న లక్ష్మీ నారాయణ సహా మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్న కొడుకే ఇలా ఆస్తి కోసం తల్లిదండ్రులను కడతేర్చాలనుకోవడం ఇప్పుడు నెల్లూరులో సంచలనంగా మారింది.