ఆమెకు మాటలు రావు.. కానీ అక్షరాలతో భావాలను పలికించగలదు. ఆమెకు చేతులు లేవు.. కానీ పదాలు అనే రెక్కలతో విహరించగలదు. మనిషి మంచానికే పరిమితం.. కానీ మనసు లోహ విహంగనం. అక్షరాలు మనిషినే కాదు, మనసును కూడా కదిలిస్తాయని మరోసారి నిరూపించింది సిరిసిల్ల రాజేశ్వరి. కాళ్లతో కవితలు రాసి ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రాజేశ్వరి బుధవారం తుదిశ్వాస విడిచింది. అనారోగ్య కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న రాజేశ్వరి.. తన అక్షరాలకు సెలవిచ్చింది. ఆమె మరణవార్త విని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
“కవితా ఓ కవితా.. మెరుపులా వచ్చావు నా మనసులోకి.. చెదిరిన నా జీవితాన్ని చిత్రంలా మార్చేశావు.. దీపం ఉంది కానీ.. వెలుగు లేదు.. మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది.. మనిషి ఉంది కానీ.. నిర్జివంగా ఉండిపోయింది..” అని తన కలంలోంచి జాలువారిన అక్షర జలపాతాలు ఇక కనిపించవు. అవును చేతులు లేకున్నాగానీ కేవలం కాళ్లతోనే దాదాపు 500 కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి బుధవారం కన్నుమూసింది. గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన రాజేశ్వరి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దాంతో వైద్య చికిత్స తీసుకుంటున్న రాజేశ్వరి తాజాగా మరణించింది. తన కవితలతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కవితా కోయిల.. కలం మూగబోయింది. రాజేశ్వరి కవితలను చదివిన ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ వాటిని ‘కాళ్లతో కవితలు’ అనే పుస్తకాన్ని ప్రచూరించి ఆమె ప్రతిభను నలుదిశలా వ్యాపింపజేశాడు. ఇక రాజేశ్వరి పరిస్థితి తెలిసి గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆమె పేరుపై రూ. 10 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించారు. నెల నెలా రూ. 10 వేల పెన్షన్ సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రాజేశ్వరి మరణవార్త విన్న పలువురు ప్రముఖులు.. సంతాపం తెలుపుతున్నారు.