ప్రముఖ తెలుగు టివి చానల్ లో ప్రసారమైన హిట్ సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు మహిళలే కాదూ మగవాళ్లు, పిల్లలు, వృద్ధులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఇందులో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, చిన్న పిల్లల క్యారెక్టర్లను తమ ఇంట్లో మనుషుల్లాగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సీరియల్‌కు ఎండ్ కార్డు పడింది. అయితే ఆ సీరియల్ చివరి ఎపిసోడ్ ఇటీవల ప్రసారం కాగా, చూడటంలో లీనమైన ఓ దుకాణాదారుడు.. కస్టమర్ విసిగించడంతో అతడి వేలు కొరికేశాడు. ఈ వింత ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత నెలలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిళి కిరాణ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య గత నెల 23న రాత్రి మద్యం సేవించి మొగిళి కొట్టకు వెళ్లి అరువు అడిగాడు. అదే సమయంలో కార్తీక దీపం చివరి ఎపిసోడ్ ప్రసారం కానుండటంతో మొగిళి సీరియల్ చూడటంలో లీనమయ్యాడు. సీరియల్ చూశాకే అరువునిస్తానని చెప్పినా.. వినిపించుకోకుండా వెంకటయ్య విసిగించసాగాడు. దీంతో కోపమొచ్చిన మొగిళి.. వెంకటయ్యపై దాడి చేసి అతడి వేలును కొరికేశాడు.
ఈ ఘటనపై వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ నిమిత్తం మొగిళిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. తనను కార్తీక దీపం సీరియల్ చూడనియ్యకుండా విసిగించడంతోనే వెంకటయ్య వేలు కొరికినట్లు పోలీసులు చెప్పాడంతో అవాక్కయ్యారు. దీంతో అతడిపై ఐపిసిలోని 290, 324లతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీరియల్స్ జనాలపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో అనడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. సీరియల్ చూడటం కోసం మనిషి వేలు కొరికిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.