దేశవ్యాప్తంగా ఆగడాలు, అరాచకాలు పేట్రేగిపోతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. రోజుకు వందల చొప్పున ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎంతమందిని ఉరి తీసినా.. ఎంతమంది ఎన్‌కౌంటర్లో పోయినా.. మరెంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఈ ధోరణిలో మార్పు రావడం లేదు. మహారాష్ట్ర థానేలో తాజాగా వెలుగు చూసిన ఘటన అందిరినీ కలచి వేస్తోంది. ఓ 15 ఏళ్ల బాలికను గత కొన్ని నెలలుగా 29 మంది నీచులు అత్యాచారం చేశారన్న విషయం బాలిక ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర థానేలో ఓ బాలికపై అత్యంత క్రూరంగా 29 మంది జనవరి నుంచి సెప్టంబర్ వరకు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఆమెకు స్నేహితుడే. బాలికైపై లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. అప్పటి నుంచి ఆ దృశ్యాలను అడ్డుపెట్టుకుని మొత్తం 29 మంది ఆమెపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో తెలిపింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గత 9 నెలలుగా నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై పలువురు సమాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.