తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డానియల్ మిస్సింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లాడ్ని అమ్మేప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు ముఠా గుట్టు రట్టు చేసినట్లుగా సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పోలీసులు అక్కడితో ఆగకుండా అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు. ఈ కిడ్నాప్ రాకెట్ మొత్తం వ్యవహారం వెలికితీసేందుకు లోతుగా విచారణ చేపట్టారు. డానియెలేనా.. గతంలోనూ ఈ తరహా కిడ్నాప్‌లు, అమ్మకాలు జరిగాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. రెండేళ్ల డానియల్‌ను సురక్షితంగా తీసుకురావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డానియల్ తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలోని కోరుకుంటకు చెందినవారు. ఆర్య, దత్తా ఐశ్వర్యలు వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని జెమినీ టాకీస్ సమీపంలో దోమ తెరలు, దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రియ ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా? తప్పు ఎవరిది?
ఐశ్వర్య కుటుంబం ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఆర్య, ఐశ్వర్య నెలక్రితం ఇక్కడికి వచ్చారు. అక్టోబరు 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో అపహరణ జరగింది. ‘హైదరాబాద్ టాప్ ఆటో’లో నుంచి దిగిన ఒక వ్యక్తి డానియల్‌ను కిడ్నాప్ చేశాడు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆటో ఎటువెళ్లిందని కనుగొన్నా.. నంబర్ ప్లేట్ లేకపోవడం పోలీసులకు సవాలుగా మారింది. బృందాలుగా విడిపోయి పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. డానియల్ అపహరణ కేసును కమిషనర్ తరుణ్ జోషి సీరియస్‌గా తీసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ, వరంగల్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగించాయి. హైదరాబాద్‌లోనూ గాలించిన పోలీసులకు ఆధారాలు లభించాయి. పిల్లాడిని అమ్మే ఉద్దేశంతోనే అపహరించినట్లు విచారణ ఒప్పుకున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.