Avula Subba Rao: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు అభ్యర్థులతో నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు బయటపడ్డాయి. దీంతో సుబ్బారావును ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ అల్లర్లలో ఆయన పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావు డిఫెన్స్ కోర్సుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అగ్నిపథ్ పథకం వల్ల ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. దీనిని అంగీకరిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని సుబ్బారావు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుబ్బారావు గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చినట్టు పోలీసులు తేల్చారు. అల్లర్లకు ఎలా పాల్పడాలన్న దానిపై యాక్షన్ ప్లాన్‌ను కూడా సుబ్బారావే అందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
12 మంది యువకులను ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సప్ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్‌తో పాటు పలు పేర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. మరి, సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Agneepath: వరంగల్ రాజేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత..