‘తెల్లనివన్నీ పాలు కాదు’ అని చదువుకున్నారు కదా? రోజూ పాల ప్యాకెట్ కోసం వెళ్లే సమయంలో అది ఒకసారి మననం చేసుకుని వెళ్లండి. కొందరు కేటుగాళ్లు కల్తీ పాలను యధేచ్ఛగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ దందా హైదరాబాద్ లోనూ నడుస్తోందనే వార్తలు నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డిలో వెలుగు చూసిన అ‘పవిత్ర’ పాల ఉత్పత్తుల వ్యవహారం ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
అధికారులు.. పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో కల్తీ పాల రాకెట్ గుట్టురట్టు చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలో పెద్దఎత్తున నడుస్తున్న కల్తీపాల దందా స్థానికంగా కలకలం రేపింది. గతంలో మూతపడిన పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీపాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నట్లు పటాన్ చెరు పోలీసులు గుర్తించారు. అడ్రస్, బార్ కోడ్.. అసలు ఊరు, పేరు కూడా లేకుండా పాలు ప్యాకెట్లు తయారు చేస్తున్నారు.
రసాయనాలను వినియోగించి పలు కంపెనీల పేర్లతో పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ‘అమూల్, హెరిటేజ్, ఎన్‌ఎస్‌ఆర్, గోవర్ధన్, విశాఖ’ వంటి ప్రముఖ బ్రాండ్లతో అక్కడ కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు.. డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లో మొత్తం ఆరు వేల లీటర్ల కల్తీ పాల ఉత్పత్తులను గుర్తించారు. కెమికల్ పౌడర్, పలు ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న కవర్లు, పెరుగు బకెట్లు, పాల ఉత్పత్తుల తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీపాల రాకెట్ స్థానికంగా, హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. పాల ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేకుంటే అనారోగ్యం పాలవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.