Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు-ట్రక్ ఢీకొట్టుకున్న ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ సిద్ధార్థ్ నగర్‌కు చెందిన 11 మంది పెళ్లికి హాజరై కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆదివారం ఉదయం కారు ఎన్‌హెచ్28 జోగియా కోత్వాలి ఏరియాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొన్న వేగానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడ్డవారిని గోరఖ్‌పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్ధ్ నగర్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ బాధను తట్టుకోవటానికి దేవుడు వారికి శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. గాయాలపాలైన వారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
అంతేకాదు! మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kondapur: తండ్రి చాటు కూతురు! అత్తింట శవమై తేలింది! గ్లోరీ చనిపోయిందా? చంపేశారా?