సాయంత్రం ఆడుకోని వస్తానమ్మా అని చెప్పిన ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నట్టింట్లో అల్లరి చేస్తూ తిరగాల్సిన చిట్టితల్లి చితిమీదకు చేరింది. ఆమె బుడి బుడి అడుగులు, ముసిముసి నవ్వులు ఇక చూడలేమన్న నిజాన్ని ఆ తల్లి ఎలా దిగమింగుకుంటుంది. ఏ బంధమూ లేని మామూలు ప్రజలకే రక్తం మరిగిపోతుంటే.. నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లికి ఏం సమాధానం చెప్తాం. ఆరేళ్ల నీ కూతురికి నూరేళ్లు నిండిపోయాయని చెప్తామా? ఓ నరరూపరాక్షసుడి వికృత చేష్ట వల్ల విగత జీవిగా మారిందని చెప్తామా? ఓ కామాంధుడి కోరికకు కాలి బూడిదైపోయిందని చెప్తామా? ఇలాంటి అకృత్యాలకు బలవుతున్న ఎంతో మందిలో నీ కూతురు ఒకతైందని చెప్పి చేతులు దులుపుకుందామా?
ఇక్కడ నిందిచాల్సింది ఎవరిని? రాజకీయ నాయకులనా, ప్రభుత్వాన్నా, ఇలాంటి ఘటనలు చూస్తూ ఇదేముందిలే అని ఊరుకున్న సమాజాన్నా? నిమ్మకు నీరెత్తకుండా ఉన్న మీడియానా? ఇందులో ఏ ఒక్కరినీ తప్పుబట్టేందుకు ఆస్కారం లేదు. ఇది అందరూ కలిసి సమష్టిగా చేసిన పొరపాటు.. కాదు కాదు తప్పు. అదికూడా కాదు ఇది అందరి నిర్లక్ష్యానికి సాక్షం. ఘటన జరిగి గంటలు, రోజులు గడుస్తున్నా ఓ క్రూరమృగం లాంటివాడు ఇంకా ఈ సమాజంలో తిరుగుతున్నాడంటే అది మన నిర్లక్ష్యమేగా? కాదని ఎవరు చెప్పగలరు.
ఘటన జరిగిన రెండు రోజులు దాకా ఎవరికీ తెలియలేదంటే ఏమనుకోవాలి. సెలబ్రిటీల వార్తలపై ఉన్న దృష్టి, శ్రద్ధ ఇలాంటి ఘటనలపై మీడియాకి ఉండదు అని ఆరోపించడానికి ఆస్కారం ఇచ్చింది మీడియానే కదా. ఘటనను విశ్లేషించడంలో పొరపాటు కానీ, సాయిధరమ్ తేజ్ కోమాలో ఉన్నాడన్న వార్త కానీ.. కారణం ఏదైనా జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. నిందితుడు రాజుకు కావాల్సినంత సమయం దొరికింది. కొన్ని గంటలపాటు మీడియా, సోషల్ మీడియా అసలు ఏ మాధ్యమంలో ఈ వార్త రాకపోవడమే నిందితుడికి తప్పించుకునే ఆస్కారాన్ని ఇచ్చింది.
ఈ ఘటనలో అందరి మదిని తొలిచేస్తున్న ఒకేఒక్క ప్రశ్న తప్పించింది ఎవరు. సీసీటీవీ ఫుటేజ్ చూసి బస్తీలో ఉండే ఒకరు అతనికి సాయం చేశాడు అని చెప్పేస్తున్నారు. అసలు అతని తప్పించుకోవడాని ప్రతిఒక్కరు కారణం. ఘటన జరిగిన 48 గంటల తర్వాత ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అంటే ఈ సమయంలో అతను ఏమైనా చేసుండచ్చు. అతని రూపురేఖలను మార్చుకోవచ్చు. అతని గుర్తింపును మార్చుకోవచ్చు. అతను స్వేచ్ఛగా కావాల్సిన చోటుకు వెళ్లుండచ్చు. అప్పుడు చూసిన రాజును ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టక పోవచ్చు. అతనికి ఇంత సమయం ఇచ్చింది మనమే కదా. మరి అతను తప్పించుకోవడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కారణం మనందరమే కదా.
సంస్కృతి, సాంకేతికత, జ్ఞానం పరంగా ప్రపంచం మొత్తం పరుగులు పెడుతోంది. మన దేశం కూడా ఎన్నో ఘనతలు, మరెన్నో విజయాలు సాధిస్తోంది. కానీ, ఇంట్లో ఉన్న చిన్నారి, బయటికెళ్లిన ఓ మహిళ, మంచంలో ఉన్న ముసలమ్మ ఇలా ఎవరికీ రక్షణ లేకపోతే ఇందుకు ఎవరిని నిందించాలి. ఒక చిన్నపిల్లని ఆ తప్పుడు దృష్టితో చూసే వాళ్ల బుద్ధిని ఎవరు మార్చాలి?. ఇందులో తప్పెవరిది? సమాజం మారాలని అందరూ అంటుంటారు. అసలు సమాజం అంటే ఏంటి? మనమే కదా? ముందు ఎవరికి వారు వారి ఆలోచనలు, నడవడిక మార్చుకుంటే సమాజం దానంతట అదే మారుతుంది.