Rapthadu: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పరువు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడ్ని అమ్మాయి తరపు వారు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాప్తాడులో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి భార్య వీణ తెలిపిన వివరాల మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల ఒక్కగానొక్క కొడుకు చిట్రా మురళి, అదే గ్రామానికి చెందిన ములుగూరు రామానాయుడు, యశోదమ్మల ఒక్కగానొక్క కూతురు వీణ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 10వ తరగతినుంచి వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసుకున్న మురళి కియా కంపెనీలో ఉద్యోగంలో చేరగా.. బీటెక్ చేసిన వీణ ఎలక్కుంట్ల గ్రామంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావటంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.
దీంతో గతేడాది జూన్ 23న ఇంట్లోంచి పారిపోయి గుడిలో పెళ్లిచేసుకున్నారు. నాలుగు నెలలు అనంతపురంలో తలదాచుకున్న తర్వాత రాప్తాడుకు వచ్చేశారు. అక్కడి ఎస్సీ కాలనీలో ఉంటూ విధులకు వెళ్తున్నారు. మురళి ఉద్యోగానికి వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైకుపై బయలు దేరాడు. బైకును ఓ పెట్రోల్ బంకులో పార్క్ చేసి, కంపెనీ బస్సు కోసం జంక్షన్‌లో నిలుచుకున్నాడు. అంతలోనే ఓ ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతడ్ని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. బొమ్మేపర్తి పొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశారు. శుక్రవారం ఉదయం పొలాల్లోకి క్రికేట్ ఆడటానికి వెళ్లిన యువకులు మురళి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీణ తల్లి యశోదమ్మతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్త మృతిపై వీణ మాట్లాడుతూ.. ‘‘ మా పెళ్లికి మా అమ్మ యశోదమ్మ ఒప్పుకోలేదు. పెళ్లయిన తర్వాత కూడా మమ్మల్ని పలుమార్లు బెదిరించింది. ‘నాకు మొగుడు లేడు.. నీకూ లేకుండా చేస్తా’ అనేది. అన్నట్లుగానే నా భర్తను హత్య చేయించింది’’ అంటూ కన్నీరు మున్నీరైంది. మరి, రాప్తాడులో చోటుచేసుకున్న ఈ పరువు హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Secunderabad Railway Station: సికింద్రాబాద్ అల్లర్లలో షాకింగ్ ట్విస్ట్! అల్లర్ల వెనుక మాస్టర్ ప్లాన్?