రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. ఓ యువతిని దాదాపు 100 మంది యువకులు కిడ్నాప్ చేశారు. యువతి ఇంటి వద్దకు వెళ్లిన యువకులు.. ఇంట్లో వారిపై దాడి చేసి మరీ యువతిని ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తుర్కయాంచల్ మున్సిపాలిటీ, మన్నేగూడెలోని సిరిటౌన్ షిప్‌లో ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపుతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు వైశాలి ఉంది. ఆమె డెంటల్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. తాజాగా, మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి.. వైశాలి ఇంటిపై దాడి చేశాడు. దాదాపు 100 మంది యువకులతో వైశాలి ఇంటి మీదకు వచ్చాడు.
వారు సీసీ టీవీలతో పాటు.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన వారిపై దారుణంగా దాడి చేశారు. వైశాలి తల్లిదండ్రులతో పాటు బంధువులపై కూడా దాడి చేశారు. ఇంట్లో ఉన్న వైశాలిని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. బాధితులు 100కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది. గతంలో నవీన్ రెడ్డిపై వైశాలి తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి, వారు ఎందుకు అతడిపై ఫిర్యాదు చేశారు? 100 మందితో వైశాలిపై ఇంటిపై నవీన్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అన్న విషయాలు తెలియరాలేదు.
అయితే, ఇంట్లో ఓ యువతీ, యువకుడు కలిసి దిగిన ఫొటోలు కొన్ని పడి ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే ఏదైనా ప్రేమ వ్యవహారం ఇందుకు కారణమై ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.