ఈ రోజుల్లో ఎవరికీ భయం లేకుండా పోతోంది. సాటి మనిషి అని కూడా చూడకుండా దాడులకు తెగబడటం, చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసేయడం ఎక్కువవుతోంది. ఇలాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక మహిళను హత్య చేసి గోనెసంచిలో ప్యాకింగ్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
మనుషుల్లో పాప భీతి లేకుండా పోతోంది. సాటి మనిషి అని కూడా చూడకుండా చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసేస్తున్నారు. కోపం, శత్రుత్వం.. కారణం ఏదైనా కావొచ్చు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఓ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఒక మహిళను అతి కిరాతకంగా మర్డర్ చేశారు కొందరు దుండగులు. హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని గోనెసంచిలో ప్యాక్ చేసి పడేశారు. గోనెసంచి నుంచి దుర్వాసన రావడంతో దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు ఈ విషయంపై సమాచారం అందించారు. ఈ దారుణమైన ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. చనిపోయిన మహిళ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
మహేశ్వరం మండలం, సర్దార్ నగర్ గేటుకు దగ్గర్లో ఈ దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ హత్య మూడ్రోజుల కిందే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళను మర్డర్ చేసిన తర్వాత కట్టేసి సంచిలో వేసి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మృతురాలి వివరాలతో పాటు ఆమె కుటుంబసభ్యుల వివరాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఏదైనా మహిళ మిస్సింగ్ కేసు నమోదైందా అనే అంశాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. మహిళ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.