ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. దగ్గరయ్యాడు.. ఆపై నిత్యం అనుమానాలు.. వినరాని మాటలు.. ఇవన్నీ తనను కఠిన నిర్ణయం వైపు నడిపించాయి. మనువాడతానన్న వాడే అలా లేని పోనీ అపనిందలు మోపడంతో ఆ యువతి బతికి లాభం లేదనుకుంది.
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. దగ్గరయ్యాడు.. ఆపై నిత్యం అనుమానాలు.. వినరాని మాటలు.. ఇవన్నీ తనను మానసికంగా కృంగదీయాయి. మనువాడతానన్న వాడే అలా లేని పోనీ అపనిందలు మోపడంతో ఆ యువతి ఇక బతికి లాభం లేదనుకొని ప్రాణాలు తీసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య జరిగిందని యువతి కుటుంబీకులు, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంగరకలాన్ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి (21). ఈమె వండర్‌లాలో ఉద్యోగం చేస్తోంది. ఎప్పటిలానే గురువారం విధులకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అదే రోజు రాత్రి 11 గంటలకు ఆదిభట్ల పోలీసులకు పల్లవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆమె జాడకోసం పోలీసులు ఎంత గాలించినా తెలియరాలేదు. శుక్రవారం ఉదయం కొంగరకలాన్ సమీపంలోని ఓ వెంచర్లో చెట్టుకు చున్నీతో ఉరివేసుకున్న స్థితిలో యువతి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ మృతదేహాన్ని పల్లవిదిగా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పల్లవికి మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, వండర్‌లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్‌లు, చాటింగ్ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గత రెండు నెలలుగా గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. మరోసారి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్రాంతి.. “నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తా”అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి.. “ఐ లవ్‌యూ.. లాస్ట్ మెసేజ్” అని క్రాంతికి వాట్సాప్ చేసింది. అనంతరం శివారు పరిధిలోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
తమ కూతురిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించాడని, అతడే ఆమెను హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరికి గిరిజన సంఘాలు సైతం మద్దతిచ్చాయి. పల్లవిపై అత్యాచారం జరిపి, హత్య చేశా రంటూ గిరిజన సంఘాలు ఆరోపించాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ సంఘాల నాయకులు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. రూ.కోటి ఎక్స్రే షియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.