నీటి గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. ఓ ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, జోద్‌పూర్‌లోని భోమియా జీకీ ఘాటీ గ్రామంలో ఓ బోరింగ్ ఉంది. ఆ బోరింగ్‌కు షకీల్, నాసిర్, బబ్లూలు మోటార్‌ను బిగించి నీటిని వారు మాత్రమే వాడుకుంటున్నారు. ఎవ్వరినీ ఆ బోరింగ్ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఎవరైనా ఆ మోటార్‌కు తమ పైపు బిగిస్తే.. వాటిని పాడు చేసేవారు. ఈ నేపథ్యంలో కిషన్‌లాల్ అనే వ్యక్తి రాత్రిళ్లు దొంగచాటుగా బోరింగ్‌ను వాడుకుంటూ వస్తున్నాడు.
ఆదివారం కూడా తనపైపుతో నీళ్లు పట్టుకోవటానికి బోరింగ్ దగ్గరకు వెళ్లారు. అయితే, కిషన్‌లాల్ నీళ్లు పట్టుకుంటూ ఉండగా ఆ ముగ్గురు చూశారు. అతడ్ని బూతులు తిట్టి అక్కడినుంచి పంపేశారు. తర్వాత కిషన్‌లాల్ ఇంటికి కూడా వెళ్లారు. కిషన్‌లాల్‌తో పాటు అతడి కుమారుడిపై కూడా దాడి చేశారు. వీరి దాడిలో కిషన్ తీవ్రంగా గాయపడ్డాడు. దెబ్బల కారణంగా తీవ్రంగా గాయపడ్డ అతడ్ని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ, సదరు నిందితులు ఇందుకు ఒప్పుకోలేదు. కిషన్ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే.. ఇందుకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషన్ మృత్యువాతపడ్డాడు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిషన్ మృతితో ఆయన వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు ఆసుపత్రి మార్చురీ వద్ద హై టెన్షన్ నెలకొంది.