కొందరు ఒకరిపై కోపాన్ని మరొకరిపై తీర్చుకుంటుంటారు. ఇటీవల తైవాన్ లో ప్రియుడిపై కోపంతో ప్రియురాలు ఏకంగా భారీ భవనానికే నిప్పు పెట్టింది. ఈ ప్రమాదంలో 46 మందికి పైగా మరణించగా, 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇది మరువక ముందే తాజాగా ఓ తల్లి కుటుంబం గొడవల కారణంగా తన నలుగురు పిల్లలను బావిలోకి తోసేసింది. ఆ తర్వాత తాను కూడా దూకి ప్రాణాల నుంచి బయటపడింది. ఇటీవల రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అజ్మీర్ జిల్లాలోని మంగళియవాస్ ప్రాంతంలో బోదురామ్ గుర్జర్, మాటియా అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లల సంతానం. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరి కుటుంబంలో గొడవలు చెలరేగాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మాటియా ముందుగా తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
మళ్లీ వెనకడుగేసి.. తాను మరణిస్తే నా పిల్లలు తల్లిలేని వారిలో మిగిలిపోవద్దని భావించిన మాటియా.. తనతో పాటు తన పిల్లలను కూడా వెంట తీసుకోవాలని అనుకుంది. ఇక అనుకున్నట్లుగానే ఇటీవల తన నలుగురు పిల్లలను తీసుకుని స్థానికంగా ఉండే ఓ బావి వద్దకు వెళ్లింది. ముందుగా తన నలుగురు పిల్లలను బావిలో తోసేసింది. బావిలో పిల్లలు ఏడుస్తున్న శబ్దాన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే బావి వద్దకు వెళ్లారు. ఈ లోపే ఆ తల్లి కూడా ఆ బావిలో దూకేసింది. అలెర్ట్ అయిన కొందరు యువకులు బావిలో దూకిన మహిళ ప్రాణాలను రక్షించారు. కానీ.. పిల్లల ప్రాణాలను మాత్రం రక్షించలేకపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.