అది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం. ఇక్కడే రాజు, శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొంత కాలం కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇక నాలుగు నెలల కిందటే ఈ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. పుట్టిన బిడ్డతో సంతోషంగా ఉండాల్సిన ఈ దంపతుల మధ్య మనస్సర్ధలు, కలతలు చెలరేగాయి. దీంతో ఆ దంపతులకు ఏం చేయాలో అర్థం కాలేదు. తరచు గొడవలు పడేవారు. చివరికి ఈ దంపతులు విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు.
కానీ వారు విడిపోవడానికి నాలుగు నెలల కిందట జన్మించిన ఆ పసిబిడ్డ అడ్డుగా కనిపించింది. ఈ క్రమంలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అదే ఆ పసి బిడ్డను అమ్మాలని. దీని కోసం భీమవరానికి చెందిన ఓ వ్యక్తికి తమ పసిబిడ్డను అమ్మాలనుకున్నారు. దీంతో అమ్మగా వచ్చిన డబ్బులను దంపతులు ఇద్దరు చెరి సగం పంచుకుని ఆ తర్వాత విడిపోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే బాబుని కొనుగోలు చేసే వ్యక్తిని శేషాచలం కొండపై ఓ ప్రాంతానికి రావాలంటూ దంపతులు రాజు, శాంతితో పాటు రాజు తండ్రి ప్రసాద్ కూడా వెళ్లారు.
ఇక అక్కడికి బాబుని కొనుగోలు చేసే వ్యక్తి కూడా రానే వచ్చాడు. అయితే ముందుగా ఆ దంపతులు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ డబ్బు సరిపోదంటూ రాజు తండ్రి ప్రసాద్ బాబు కొనుగోలు చేసే వ్యక్తితో గొడవకు దిగాడు. ఇదే విషయం అక్కడున్న భక్తులకు తెలిసిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దంపతులతో పాటు మరో ఇద్దరిని నిందితులను అదుపులోకి తీసుకుని ఆ పసి బిడ్డను రక్షించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.