మరో 15 రోజుల్లో వారిద్దరూ పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. వారి జీవితాలను తలకిందులు చేసింది. ఆ వివరాలు..
వారిద్దరికి పెద్దలు వివాహం నిశ్చయం చేశారు. మరో 15 రోజుల్లో వివాహం. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలయ్యింది. పెళ్ల పనులు చకచకా సాగుతున్నాయి. రాబోయే జీవితాన్ని తలుచుకుంటూ కాబోయే దంపతులు ఊహల్లో తేలియాడుతున్నారు. ఈ క్రమంలో కాబోయే దంపతులు ఇద్దరు కలిసి ఆలయానికి వెళ్తుండగా.. మార్గ మధ్యలోనే దారుణం చోటు చేసుకుంది. దాంతో మరి కొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. చావు మేళాలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఇంతకు ఏం జరిగింది అంటే..
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాబోయో దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొత్తూరుకు చెందిన రాజ్‌కుమార్‌కి.. కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన దుర్గాభావినితో వివాహం నిశ్చయించారు పెద్దలు. వచ్చే నెల అనగా మే 10, 2023న వీరి పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు పెద్దలు. ఈ క్రమంలో మంగళవారం రాజ్ కుమార్, దుర్గా భవానిలు సమీపం బంధువు ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లికి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకుని.. తిరిగి రాజమహేంద్రవరం వైపుగా వెళ్తుండగా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.
రాజ్ కుమార్, భవానిలు.. దివాన్‌చెరువు దాటి గామన్ వంతెన మీదుగా కొవ్వూరు వైపు వెళ్తుండగా కొంతమూరు సమీపంలో.. వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను రాజమండ్రి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాబోయే దంపతుల మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఇక రాజ్ కుమార్ తల్లి వేణమ్మ.. 1997లోనే చనిపోయారు. రాజ్‌కుమార్‌కు అక్క ఉంది.. ఆమెకు కూడా వివాహైంది. రాజ్‌కుమార్ తాపీపని చేసుకుంటూ తండ్రితో పాటూ ఉంటున్నాడు. దుర్గాభవానిది పేద కుటుంబం.. తండ్రి కూలిపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్, దుర్గా భవానిలు ఇద్దరు చనిపోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి. పెళ్లి పీటలెక్కాల్సిన జంట ఇలా ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.