గురువుని దైవంగా భావించాలని పిల్లలకు నేర్పుతాము. విద్యార్థులను కన్న పిల్లల్లా భావించాలని ఆ గురువుకు కూడా తెలియాలి కదా? కొందరు ఉపాధ్యాయుడు అనే పదానికే మచ్చ తెచ్చేలా నడుచుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో అలా ఓ విద్యార్థినితో తప్పుగా నడుచుకున్న ఓ ప్రధానోపాధ్యాయుడికి సరైన గుణపాఠం నేర్పారు తల్లిదండ్రులు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
అసలు విషయం ఏంటంటే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించింది. దగ్గరకు తీసుకుని అడగగా అసలు విషయం తెలిసింది. విద్యార్థిని ఆ స్కూల్ డైరెక్టర్ కమ్ ప్రధానోపాధ్యాయుడు శివారెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అమ్మాయి చెప్పింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే ఇంక చదువుకోలేవని బెదిరించినట్లు ఆరోపించింది. బాలికను యథావిధిగా స్కూలుకు వెళ్లాల్సిందిగా తల్లిదండ్రులు సూచించారు. తర్వాత తల్లిదండ్రులు మధ్యాహ్నం స్కూలుకు వెళ్లి శివారెడ్డిని నిలదీశారు. అప్పుడు కూడా అతను ఏమీ చేయలేదని బుకాయించేందుకు ప్రయత్నించాడు. విద్యార్థిని పిలిచి అడగగా జరిగిన విషయం తెలిపింది. గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలియజేసింది.
తర్వాత తల్లిదండ్రులు శివారెడ్డికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.