మినీ చైనా వాల్ లాంటి గోడ.. దానిపై ముట్టుకుంటే ఫట్టుమనే కరెంట్ తీగలు, పగలురాత్రి గస్తీ కాసే పోలీసుల ఉన్నా కూడా ఒక ఖైదీ జైలు నుంచి పారిపోయాడు. దుర్భేద్యమైన జైలు నుంచి పారిపోవడం సాహసమే కానీ.. అంత రిస్క్ చేసి పారిపోయిన వాడు మళ్లీ స్వయంగా తానే తిరిగి జైలుకు రావడం విశేషం. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా జైలును ఇటీవల అత్యంత అధునాతనంగా నిర్మించారు. కాంపౌండ్ వాల్స్ ఎక్కువ ఎత్తులో నిర్మించి, వాటిపై ఎలక్ట్రిక్ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా శనివారం ఓ ఖైదీ తప్పించుకుని పోయాడు. దీనిపై జిల్లా జైలు అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే పారిపోయిన ఖైదీ ఉదయం తిరిగి జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో జైలు అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. కుల్లాయి అలియాస్ నాని గత నెల ఓ హత్య కేసులో అరెస్టై ఫిబ్రవరి నుంచి జిల్లా జైలులో ఉంటున్నాడు. అయితే శనివారం పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి పారిపోయాడు. నాని జైలు నుంచి పారిపోయినట్లు పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే పారిపోయిన నాని తిరిగి ఉదయాన్నే అదే జైలుకు తిరిగి వచ్చేశాడు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసుల పహారా మధ్య ఆ ఖైదీ జైలు నుంచి ఎలా పారిపోయాడు? తిరిగి మళ్లీ ఎందుకు వచ్చాడు? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జైళ్లశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలుండటంతో వారిపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొందరు జైలు అధికారులపై వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం! మంటల్లో చిక్కుకున్న 5 ఏళ్ల చిన్నారి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.