ద్వాపర యుగంలో పాండవులు తమ కౌరవ సోదరులతో పాచికలు ఆడతారు. అంతా పోగొట్టుకున్న తర్వాత తమ ఐదుగురి భార్య అయిన ద్రౌపదిని కూడా పందెం కాస్తారు. ఆమెను కూడా పందెంలో ఓడిపోతారు. ఇదేప్పుడో 5 వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన. వేల ఏళ్లు గడిచిపోయింది. కాలం బాగా మారిపోయింది. సమాన హక్కుల కోసం ఆడవాళ్లు మగవారితో పోరాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ కాలానికి తగినట్లు ఓ మహిళ అందరినీ ఆశ్చర్యపరిచే పని చేసింది. ఆనాడు పాండవులు భార్యను పందెం కాస్తే.. ఈనాడు ఓ మహిళ జూద వ్యసనంతో తనను తాను కుదవపెట్టుకుంది. పందెంలో ఓడిపోయి తన యజమానికి సొంతం అయిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ప్రతాప్‌ఘర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు.
ఆరు నెలల క్రితం ఇటుకల బట్టీలో పనిచేయటానికి ఉత్తర ప్రదేశ్‌నుంచి రాజస్తాన్‌కు వెళ్లాడు. నెలనెలా భార్యకు డబ్బులు పంపుతూ ఉండేవాడు. అయితే, భర్త పంపే డబ్బులతో అతడి భార్య లూడో అనే బెట్టింగ్ గేమ్ ఆడేది. అలా భర్త పంపిన డబ్బులను నీళ్లలా ఖర్చు చేసేది. ఇక, భర్త పంపిన డబ్బులు మొత్తం అయిపోవటంతో ఆమెకు బుర్ర పనిచేయలేదు. లూడో ఆడకపోతే ప్రాణాలు పోతాయేమో అని ఫీల్ అయింది. వెంటనే తన యజమాని దగ్గరకు వెళ్లి తనను తాను తాకట్టు పెట్టుకుంది. డబ్బులు తిరిగి చెల్లించకపోతే ఆయనకు బానిసగా ఉండేట్లు ఒప్పందం కుదుర్చుకుంది. ఓనర్ ఇచ్చిన డబ్బులతో లూడో ఆడింది. అయితే, ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. లూడో ఆటలో ఆమె ఓడిపోయింది.
ఓనర్ ఇచ్చిన డబ్బుల్ని మొత్తం పోగొట్టుకుంది. తర్వాత ఒప్పందం ప్రకారం ఓనర్‌కు వశమైంది. ఓనర్‌తోనే ఉండసాగింది. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ భర్త ఇంటికి వచ్చాడు. భార్య తన ఓనర్‌తో ఉండటం చూసి షాక్ తిన్నాడు. ఎందుకు అక్కడ ఉంటున్నావ్ అని అడగ్గా.. ఓనర్‌తో చేసుకున్న ఒప్పందాన్ని చెప్పింది. అది విన్న అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ‘‘ జరిగిందేదో జరిగిపోయింది. డబ్బులు కడతాను ఇంటికి తిరిగివచ్చేయ్’’ అని అన్నాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. ఓనర్ ఇంటినుంచి తిరిగివెళ్లటానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఓనర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.