స్నేహితుడిని నమ్మి.. ఆపదలో ఉన్నాడని జాలి పడి.. భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసింది ఓ వివాహిత. అయితే ఆ స్నేహితుడు చేసిన మేలు మర్చిపోయి.. ఆమెనే అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వివరాలు..
వారిద్దరూ బాల్యం నుంచి స్నేహితులు.. కలిసి చదువుకున్నారు. అతడిని మంచి స్నేహితుడిగా భావించింది.. వివాహం తర్వాత కూడా ఆ స్నేహ బంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో తన మిత్రుడు కష్టాల్లో ఉన్నట్లు తెలిసింది. తాము సాయం చేస్తే.. మిత్రుడి పరిస్థితి బాగవుతుందని.. అప్పుల భారం తగ్గుతుందని భావించి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 లక్షల రూపాయలు ఇచ్చింది. అయితే అపాత్ర దానం ఎంత చేటు చేస్తుందో ఈ సంఘటనతో మరోసారి రుజువు అయ్యింది. స్నేహితుడు బాగుపడాలని ఆమె డబ్బులు ఇస్తే.. వ్యసనాలకు బానిసైన ఆ వ్యక్తి.. స్నేహ ధర్మాన్ని సైతం మర్చి.. తనను ఆదుకున్న స్నేహితురాలిని హత్య చేయాలని భావించాడు. అప్పు తీరుస్తానని చెప్తే.. నమ్మి వెళ్లిన ఆమె.. అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అతి తెలివి మిత్రుడు.. ఆదుకున్న స్నేహితురాలినే హత్య చేసి.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అనేక సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక ఈ దారుణం ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన రాధకు.. కొన్నాళ్ల క్రితం తెలంగాణ, సూర్యపేట, కోదాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోహన్‌రెడ్డితో వివాహం అయ్యింది. ఉద్యోగరీత్యా రాధ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇక రాధ బాల్య మిత్రుడు కేతిరెడ్డి కాశిరెడ్డి అలియాస్ చినకాశయ్య.. అప్పటికే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక బాల్యం నుంచి రాధకు, కాశిరెడ్డి మధ్య మంచి స్నేహం ఉంది. రాధకు వివాహం అయిన తర్వాత కూడా ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహవాతావరణం కొనసాగింది.
ఇలా ఉండగా కొన్నాళ్ల క్రితం కాశి రెడ్డి పని చేస్తోన్న కంపెనీ.. అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ సమయంలో అతడు.. రాధను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. పైగా తన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఆలోచన ఉందని.. దాన్ని అమలు చేయాలంటే డబ్బులు అవసరమవుతాయని.. రాధ, మోహన్‌రెడ్డి దంపతులకు తెలిపాడు. కాశిరెడ్డి మాటలు నమ్మిన రాధ.. బాల్య మిత్రుడు ఇలా బాధపడటం చూసి.. జాలి కలిగి.. అతడిని ఆదుకోవాలని భావించింది. దానిలో భాగంగానే అతడికి 80 లక్షల రూపాయల వరకు అప్పుగా ఇప్పించారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత కాశిరెడ్డిలో మార్పు వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునేవాడు..
అయినా రాధ అతడిని వదిలిపెట్టలేదు. జిల్లెళ్లపాడు నుంచి తన తల్లిదండ్రులు, మరి కొందరు బంధువులకు విషయం చెప్పడంతో.. వారు వచ్చి కాశిరెడ్డిని డబ్బుల గురించి అడిగారు. అనేకసార్లు.. ఈ విషయమై అతడిని ఫొన్లో నిలదీశారు రాధ దంపతులు. అయినా సరే లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో గ్రామంలో చౌడేశ్వరి కొలుపులు ఉండటంతో.. ఈ నెల 11న చిన్న కుమారుడిని తీసుకుని.. రాధ స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి కాశిరెడ్డికి కాల్ చేసి డబ్బుల గురించి అడిగింది. రాధను హత్య చేస్తే.. ఇక తనను డబ్బులు అడిగేవారు ఎవరు ఉండరని భావించిన కాశిరెడ్డి.. మే 17న ఆమెకు కాల్ చేసి.. కనిగిరి వస్తే.. తన అనుచరులు వచ్చి బాకీ డబ్బుల్లో కొంత నగదు ఇస్తారని.. చెప్పి నమ్మించాడు.
అతడి మాటలు నమ్మిన రాధ.. తన స్వగ్రామం నుంచి చిన్నకొడుకును తీసుకుని.. కనిగిరి వెళ్లింది. కుమారుడిని తన బాబాయ్ ఇంట్లో వదిలి పామూరు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. సాయంత్రం 6.47 సమయంలో బస్టాండ్ ప్రాంతానికి ఒక రెడ్ కలర్ కారు వచ్చి ఆగింది. అయితే కారులో అపరిచిత వ్యక్తులు ఉండటంతో.. రాధ ఒకడుగు వెనక్కి వేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత పామూరు రోడ్డులోని గుజ్జుల యలమందారెడ్డి విగ్రహం వద్ద.. రాధను కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా ఆమెను హింసించి హత్య చేశారు. రాధను చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆమె చేతి మీద కాల్చిన గుర్తులు ఉన్నాయి.
స్నేహితుడని నమ్మి.. ఆదుకుంటే.. కాశిరెడ్డి ఇంత దారుణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. రాధను చంపితే సమస్య పరిష్కారం అవుతుంది.. డబ్బులు ఇచ్చే అవసరం ఉందడదని భావించే.. కాశి రెడ్డి ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు అందరు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాశిరెడ్డితో పాటు మరు నలుగురు నిందితులు ఉన్నారని భావిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కాశిరెడ్డి బంధువులను, స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.