ఇటీవల ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు డ్రైవర్లకు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా.. బూడిదల పోసిన పన్నీరే అవుతుంది.
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేదరు. అందుకే అంటారు.. వాన రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు అని.. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రోడ్లపై వెళ్తున్న డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది చనిపోతున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఓ కుటుంబాన్ని కారు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా పామురు మండలం-తాతయ్యపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య రామ సుబ్బమ్మ కర్ణాటకలోని హల్సూర్ లో కొంతకాలంగా స్థిరనివాసం ఏర్పర్చుకొని ఉంటున్నారు. ఈ దంపతుల కుమార్తె కీర్తి రెడ్డి, కుమారుడు వంశి తో కలిసి బెంగుళూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కీర్తి రెడ్డికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హరీష్ తో వివాహం జరిగింది. హరీష్ సైతం వర్క్ ఫ్రమ్ హూమ్ చేస్తున్నాడు. రామ సుబ్బమ్మ ఆడపడుచు భర్తకు గుండెపోటు రావడంతో పరామర్శించేందుకు భర్త, కుమార్తె, అల్లుడు తో కలిసి కారులో గుంటూరు బయలుదేరారు. తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో తెల్లవారు జామున పాలకూరు వద్ద ఓ లారీని వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి నుజ్జు నుజ్జు అయ్యింది. రామసుబ్బమ్మ స్పాట్ లోనే చనిపోయింది.. హరీష్, వెంకటేశ్వరెడ్డి కి స్వలప్ప గాయాలతో బయట పడ్డారు. ఇక ఈ ప్రమాదంలో కీర్తి రెడ్డి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే 108 కి ఫోన్ చేసి అంబులెన్స్ లో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామ సుబ్బమ్మ మరణంతో ఇంట్లో కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరి ప్రసాద్ తెలిపారు.