ఇంట్లో కుటుంబ సభ్యుల్లో, స్నేహితులు, సన్నిహితుల దృష్టిలో ఈ అబ్బాయి చాలా మంచోడు అన్న పేరు ఉంది. కానీ చేసేవన్నీ చెత్త పనులు. 36 ఏళ్లలో 31 మంది ఆడవారిపై అత్యాచారం చేశాడు. 40 ఏళ్లుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి దొరికాడు. దొరికే సమయానికి చచ్చాడు. ఆ సీరియల్ రేపిస్ట్ పేరు కీత్ సిమ్స్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వాసులని 30 ఏళ్ల పాటు వరుస అత్యాచారాలతో వణికించాడు. అత్యాచారానికి పాల్పడిన దాదాపు 40 ఏళ్ల తర్వాత పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. 1985 నుంచి 2001 మధ్య కాలంలో సిమ్స్ మొత్తం 31 మంది మహిళలను చెరబట్టాడు. ఈ 16 ఏళ్ల వ్యవధిలో 31 మందిపై మృగంలా పడి కామవాంఛ తీర్చుకున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూనో, జాగింగ్ కి వెళ్తున్నప్పుడో కొందరిని, ఇళ్లలోకి చొరబడి కొందరిని అత్యాచారం చేశాడు.
తన దగ్గర కత్తి ఉందని బెదిరించి కొందరిని, కత్తి చూపించి కొందరిని బెదిరించి అత్యాచారాలకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. 14 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళలపై అత్యాచారం చేసినట్లు పోలీసుల పరిశోధనలో తేలింది. తమపై అత్యాచారం చేసిన వాడు ఎలా ఉంటాడు అని అడిగితే.. దాదాపు అందరూ ఒకేలా సమాధానం చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి 160 నుంచి 180 సెంటీమీటర్ల ఎత్తు ఉంటాడని.. నల్లగా ఉంటాడని.. కళ్ళు గోధుమ రంగులో ఉంటాయని.. ముక్కు వెడల్పుగా ఉంటుందని చెప్పారు. అత్యాచారం చేసిన సమయంలో ట్రాక్ సూట్ హూడీస్, ఫుట్ బాల్ షార్ట్ వంటివి ధరించి ఉంటాడని చెప్పారు. మొదట్లో ఈ అత్యాచారాలని వేర్వేరు వ్యక్తులు చేస్తున్నారని పోలీసులు భావించారు.
అప్పటికి డీఎన్ఏ టెక్నాలజీ లేదు కాబట్టి గుర్తించడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు డీఎన్ఏ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ టెక్నాలజీ సహాయంతో ఒక్కడే ఈ అత్యాచారాలు చేసినట్లు గుర్తించారు. ఈ సిమ్స్ మీద బోండీ బీస్ట్, ట్రాక్ సూట్ రేపిస్ట్ గా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. తొలిసారిగా సిడ్నీ నగరం.. క్లోవెల్లీ శివారులోని సముద్ర తీరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల రికార్డుల ప్రకారం కీత్ సిమ్స్ 2001లో క్లోవెల్లీ సమీపంలోని స్మశానం వద్ద చివరిసారిగా అత్యాచారం చేశాడు. 31 రేప్ కేసులను విడివిడిగా పరిశోధించిన పోలీసులు.. 2000వ సంవత్సరంలో వాటన్నిటినీ లింక్ చేసి పరిశోధించారు. 31 కేసుల్లో 12 కేసులకు సంబంధించిన బాధితుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఒకేలా ఉందని గుర్తించారు.
మిగతా 19 కేసుల్లో నేరం జరిగిన తీరు ఒకేలా ఉందని గుర్తించారు. అప్పటి నుంచి నిందితుడ్ని వెతకడం మొదలుపెట్టారు. కేసు దర్యాప్తు సమయంలో 2019లో పోలీసులకు బలమైన ఆధారం దొరికింది. పోలీసుల డేటా బేస్ లో డీఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో అనుమానితుల జాబితా 324 మందికి తగ్గించారు. ఆ 324 మందిలో ఆ సీరియల్ రేపిస్ట్ ఒకడు ఉన్నాడు. వాడ్ని పట్టుకుంటే కేసు సాల్వ్ అవుతుంది. ఆ సీరియల్ రేపిస్ట్ ఎవడో తెలుసుకునే క్రమంలో.. ఈ ఏడాది సెప్టెంబర్ లో కొన్ని కేసులు నమోదయ్యాయి. అవి కీత్ సిమ్స్ చేసినవి. సిమ్స్ మీద రేప్ కేసులే కాకుండా ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల్లో బాధితుల నుంచి సేకరించిన డీఎన్ఏ.. 12 కేసులకు సంబంధించి బాధితుల నుంచి సేకరించిన డీఎన్ఏ తో మ్యాచ్ అవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు.
ఈ క్రమంలో ఈ వరుస అత్యాచారాలు చేసింది కీత్ సిమ్స్ అని తేలింది. పట్టుకునేందుకు అతని ఇంటికి వెళ్లగా అప్పటికే కీత్ సిమ్స్ మరణించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కీత్ సిమ్స్ మరణించాడు. 66 ఏళ్ల వయసులో మరణించిన కీత్ సిమ్స్.. ఒక పాపాత్ముడు, సీరియల్ రేపిస్ట్ అంటే ఇంట్లో వాళ్ళు నమ్మలేకపొతున్నారు. తమ తండ్రి అలాంటి వాడు కాదని పిల్లలు, తమ తాత మంచోడని మనవళ్ళు అంటున్నారు. ఈ అత్యాచారాలతో కిమ్స్ కి సంబంధం ఉందని గుర్తించిన డిటెక్టివ్.. సిమ్స్ కుటుంబ సభ్యులను కలిసినప్పుడు తమకు ఏమీ తెలియదని అన్నారు. సిమ్స్ భార్య అయితే షాక్ తిందట. తన భర్త ఆడవారిని అత్యాచారం చేశాడంటే నమ్మలేకపోయిందని డిటెక్టివ్ షెల్లీ జాన్ వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని గుర్తించిన విషయాన్ని బాధితులకు చెప్పారు పోలీసులు. అయితే అతను మరణించడం వల్ల చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని పోలీసులు తెలిపారు.