Kadapa: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై కొన్ని పందులు దాడి చేసి చంపేశాయి. వృద్ధురాలు ఇంటి బయట నిద్రిస్తుండగా శుక్రవారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన నాగిరెడ్డి సిద్ధమ్మ అనే 80 ఏళ్ల వృద్దురాలు కుటుంబంతో కలిసి తపాలా కార్యాలయం వీధిలో నివసిస్తోంది. సిద్ధమ్మకు ఆరు బయట మంచంపై పడుకోవటం అలవాటు. రోజులాగే శుక్రవారం ఉదయం మంచంపై కాస్త సేదదీరింది. పది గంటల సమయంలో ఓ పందుల గుంపు అక్కడికి వచ్చింది.
మంచంపై నిద్రపోతున్న సిద్ధమ్మపై దాడి చేసింది. అన్ని కలిసి ఒక్కసారిగా ఆమెపై పడి దాడి చేయటం మొదలుపెట్టాయి. ముక్కు, చెవులు, చేతి వేళ్లు కొరికి తినేశాయి. దీంతో ఆమె అరవటానికి కూడా నోరు రాక స్ప్రహ కోల్పోయింది. ఇంటి బయట ఏదో చప్పుడు వినిపిస్తుండటంతో లోపల ఉన్న కూతురు బయటకు వచ్చింది. పందులు తన తల్లిపై దాడి చేయటం చూసి భీతిల్లింది. చావు కేకలు పెట్టింది. ఆ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పెద్దగా అరుస్తూ, పందులను అక్కడినుంచి తరిమి కొట్టారు. ఆ వెంటనే వృద్ధురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది. ఇక, బ్రహ్మంగారి మఠంలో పందుల బెడద ఎక్కువగా ఉందని జనం వాపోతున్నారు. ఎలాగైనా పందుల బారినుంచి తమను రక్షించాలని ప్రార్థిస్తున్నారు. మరి, ఇంటి బయట మంచంపై నిద్రపోతున్న వృద్ధురాలిని పందులు దాడి చేసి చంపేసిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.