ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎంత మందిని శిక్షించినా కూడా యువతులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా కూాడా ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివాహితుడు అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో శ్మశానానికి లాక్కెళ్లి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బహిర్భూమికి బయటకు వెళ్లింది. అక్కడే మాటువేసి ఉన్న 48 ఏళ్ల గౌరు నాయుడు బాలిక బయటకు రాగానే ఒక్కసారిగా పట్టుకున్నాడు. ఆమెను పట్టుకుని శ్మశానంవైపు పరుగులు తీశాడు. ఆ బాలిక కేకలు వేస్తుండటంతో ఆమె నోరు గట్టిగా నొక్కాడు. ఆమెను శ్మశానానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అటుగా వస్తున్న స్థానికులు అలికిడి విని రావడంతో.. గౌరు నాయుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు.
బాలికను చూడగా తీవ్ర రక్తస్రావం అవుతోంది. ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గౌరు నాయుడు కోసం స్థానికులు గాలించగా.. పక్క గ్రామంలో అతను ఆచూకీ తెలిసింది. వెంటనే అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు గౌరునాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రరం వ్యక్తం చేస్తున్నారు. గౌరు నాయుడులాంటి నీచుడిని ఊరికే వదలకూడదు.. కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.