ఆర్బీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సంయుక్తంగా దర్బంగా ఎక్స్ ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 34 మంది చిన్నారులను బాల కార్మికులు అవ్వకుండా ఆపగలిగారు.
నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ గారు చెప్పిన మాటల్ని ప్రభుత్వాలు చక్కగా అమలు పరుస్తున్నాయి. పిల్లలను బడి మాన్పించి పనులలో చేర్పించొద్దంటూ నినాదాలు ఇచ్చి.. సర్కారు బడులలో విద్యార్థులకు తగిన బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు మైనర్ బాలలను పనులలో చేర్చుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కూడా అక్కడక్కడ నిత్యం బాలకార్మికులు కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా, బాలలను అక్రమ రవాణా చేస్తూ.. నలుగురు నిందితులు పట్టుబడిన ఘటన ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బుధవారం వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్ లో ఆర్బీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. దర్భంగా ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో తనిఖీ చేసి 34 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. వీరిని బీహార్ నుండి పని కోసం సికింద్రాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
వివిధ పరిశ్రమల్లో పని చేయడానికి బాలలను అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. వారందరినీ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారని చైల్డ్ వెల్పేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు వెల్లడదించారు. పిల్లల వివరాలను తెలుసుకొని వారి యజమానులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి పిల్లలను అప్పగించనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు వచ్చే వరకు పిల్లలను బాలల సంరక్షణ కేంద్రంలోనే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.