ప్రేమ.. ప్యార్.. అంటూ మాయమాటలు మొదలుపెట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకు నువ్వే నా ప్రాణమంటూ కొత్త పరిచయానికి తెరలేపాడు. చివరకి నిన్ను చూడాలని ఉందంటూ సందేశం పంపగా, యువతి ఒంగోలు నుండి నగరానికి చేరుకుంది. అంతే.. ఆపై కాసేపటికే యువతి నడిరోడ్డుపై రోధించడం మొదలుపెట్టింది. అచ్చం సినిమా స్టోరీలా ఉన్న ఈ కథనాన్ని మీరు తప్పక చదవాల్సిందే.
‘ప్రేమ పేరుతో కళ్లు బొల్లి మాటలు చెప్పడం.. ఆ తరువాత మొహం చాటేయటం..’ ఈ సీన్లు సినిమాల్లో కంటే ఎక్కువుగా సమాజంలో జరుగుతుంటాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొందరు, నాలుగేళ్లు తిరిగాక ఇప్పుడు వద్దంటున్నాడని ఇంకొందరు, గర్భం దాల్చాక మొహం చేటేశాడని మరికొందరు.. ఇలా ఎంతమంది యువతులు బయటకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ అమ్మాయిలు అప్రమత్తమవ్వడం లేదు. మోసపోతూనే ఉన్నారు. తాజాగా, ఓ యువకుడి మాయమాటలు నమ్మి సిటీకి వచ్చిన యువతి.. అతడి చేసిన మోసాన్ని తట్టుకోలేక హైదరాబాద్ రోడ్లపై రోదించింది. ఆ వివరాలు..
ఒంగోలుకు చెందిన యువతి, నిజామాబాద్‌కు చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. రోజూ గంటల తరబడి ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే అతని మాయమాటలు నమ్మిన యువతి ప్రేమలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడు హైదరాబాద్‌కు రావాల్సిందిగా కోరాడు. ఇంకేముంది.. ప్రేమించిన వాడు కోరడంతో యువతి వెనకా ముందు ఆలోచించకుండా కన్న తల్లిదండ్రులను, సొంతూరును సైతం వదిలి హైదరాబాద్ చేరుకుంది. అలా నగరానికి చేరుకున్న యువతిని లింగంపల్లికి తీసుకెళ్ళిన ప్రియుడు అక్కడే రోడ్డుపై వదిలిపెట్టి మాయమయ్యాడు.
అతని రాక కోసం గంటల తరబడి వేచిచూసిన యువతి ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. ఎటు వెళ్లాలో పాలుపోక రోడ్డుపక్కన కూర్చుని రోదించడం మొదలుపెట్టింది. అటుగా వెళ్లేవారు యువతి పరిస్థితి చూసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువతికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పటాన్ చెరులో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేసే యువకుడిని ప్రేమించినట్లు… అతడు రమ్మన్నాడనే హైదరాబాద్ కు వచ్చినట్లు యువతి వారితో తెలిపింది. ప్రస్తుతం అతడి ఫోన్ స్విచ్చాప్ వస్తోందని యువతి తెలిపింది. దీంతో పోలీసులు సదరు యువతిని స్టేట్ హోంకు తరలించారు. ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని… వారితో యువతిని పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.