ప్రజలను కాపాడాల్సినోడు దొంగకు కాపలాగా ఉంటే ఎలా ఉంటుంది? ప్రజా ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన పోలీసు కానిస్టేబుల్ చోరీకి సహకరించడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులకు సమాజంలో ఎంత గౌరవ, మర్యాదలు ఉంటాయో తెలిసిందే. ప్రజల ఆస్తులతో పాటు వారికి భద్రత కల్పించే బాధ్యత పోలీసుల మీదే ఉంటుంది. అలా ప్రజలకు రక్షణ కల్పిస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసులు కూడా ఎంతోమంది ఉన్నారు. అదే సమయంలో డబ్బులకు కక్కుర్తి పడి, అవినీతికి పాల్పడుతూ పోలీసు ఉద్యోగానికి మరక తెచ్చిన వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. అర్ధరాత్రి ఒక ఆటో డ్రైవర్ చేసిన దొంగతనానికి పోలీసు సహకరించడం హాట్ టాపిక్‌గా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్.. చోరీ చేసిన వ్యక్తికి కాపలాగా మారడం చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ టౌన్‌లోని వర్ని రోడ్డు చౌరస్తా దగ్గర ఆదివారం రాత్రి 1.39 గంటలకు ఒక ఆటో రిక్షా నుంచి ఒక కానిస్టేబుల్ దిగాడు. అతడితో పాటు ఆటో డ్రైవర్ కూడా కిందకు దిగి ఒక ఇంటిముందు పార్క్ చేసి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. ఆటో డ్రైవర్ పెట్రోల్ తీస్తుంటే అతడికి కానిస్టేబుల్ కాపలాగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఐదో టైన్ ఎస్ఐ సాయినాథ్ స్పందిస్తూ.. పెట్రోల్ దొంగిలించిన ఏరియా ఎక్కడో అర్థం కావడం లేదన్నారు. సీసీ ఫుటేజీ చూశామని, ఆ టైమ్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎవరనేది విచారణ చేపడుతున్నామని సాయినాథ్ తెలిపారు.