ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సహాయం తీసుకోవడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అన్న తారతమ్యం లేకుండా అందరూ గూగుల్ నే ఆశ్రయిస్తున్నారు. చదువుకునే పాఠ్యంశాల మొదలు వండుకునే వంటలు వరకు అన్ని వివరాలు గూగుల్ అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన ఓ వైద్యురాలు తన ప్రేమ సమస్యల పరిష్కారానికి గూగుల్ ని ఆశ్రయించింది. చివరకు.. ఆ సమస్యల నుంచి బయటపడకపోగా నైజీరియన్ల వలకు 12.45 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నైజీరియాకు చెందిన 41 ఏళ్ల ఒక్వుచుక్వు, 35 ఏళ్ల ఓబిబుర్ జోన్తన్ ఉజాక, మైఖేల్ అజుండా, డేనియల్.. అను నలుగురు వ్యక్తుల బట్టల వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల క్రితం భారత్ కు వచ్చారు. ఈ వ్యాపారం వారిని నష్టాలపాలు చేసింది. దీంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ఢిల్లీ కేంద్రంగా మోసాలు చేయడం ప్రారంభించారు. ఏ సమస్యకు అయినా పరిష్కారం చూపిస్తామంటూ ఇంటర్ నెట్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో తమ ఫోన్ నంబర్లు ఉంచారు. సంప్రదించిన వారిని మాయ మాటలతో బురిడీ కొట్టించి డబ్బులు లాగుతుంటారు.
ఈ క్రమంలో కుషాయిగూడకు చెందిన ఓ కంటి వైద్యురాలు తన ప్రేమ వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడేందుకు మాంత్రికుడి సాయం తీసుకోవాలనుకుంది. గూగుల్ లో స్వామీజీ కోసం వెతికింది. అక్కడ ఆమెకు ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దీంతో వెంటనే ఆ నంబర్ కు ఫోన్ చేసింది. వీరి లైన్ లోకి వచ్చారు. తాము ఇలాంటి వాటిలో బాగా ఆరితేరిన వారిమని.. ఉగండాకు చెందిన వ్యక్తితో ప్రార్థనలు చేయించి సమస్య పరిష్కరిస్తామంటూ మభ్యపెట్టారు. అందుకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని సూచించారు. డాక్టర్ డబ్బులు చెల్లించింది. కొన్నాళ్లకు సమస్య పరిష్కారమైంది.
వీరిని సంప్రదించడం వల్లనే తన సమస్య పరిష్కారమయ్యిందనే భావనతో వైద్యురాలు, తాను వ్యాపారం మొదలు పెట్టాలని, అది బాగుండాలంటే ప్రార్థనలు చేయించాలని భావించి, తిరిగి వారిని సంప్రదించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మాయగాళ్లు ప్రార్థనల పేరుతో రక రకాల కారణాలు చెబుతూ ఆమె వద్ద నుంచి రూ. 12,45,105 వివిధ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు అడగడంతో ఇదంతా మోసమని గుర్తించిన వైద్యురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులిద్దరని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.