ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు భార్యాభర్తలు. తర్వాత పిల్లలు పుట్టాక వారి బంధం మరింత బలోపేతం అవుతుంది. ఒకరి నుండి మరొకరు వేరు పడలేరు. భర్త ఆలోచనలను, ఆహార వ్యవహారాలను తెలుసుకుని.. అతడికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే భార్య అభిప్రాయాలను విలువనిస్తుంటాడు భర్త. అందుకే భర్తలో సగం భార్య అంటారు. అయితే కొన్ని సార్లు విధి పరీక్ష పెడుతోందో లేక విధి రాత నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదో తెలియదు కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పెళ్లైన తొలి రాత్రే భార్యా భర్తలు మృతి చెందిన విషాద ఘటన యూపీలోని బహ్రైచ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 30న ప్రతాప్ యాదవ్ (22), పుష్ప (20)ల పెళ్లి జరిగింది. మరుసటి రోజు తొలి రాత్రి ఏర్పాటు చేశారు. మే 31న నిద్రించేందుకు వారి గదిలోకి వెళ్లిన నవ జంట మరుసటి రోజు ఉదయం శవమై కనిపించారు. సమాచారం అందిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టంలో వీరిద్దరూ గుండెపోటుతో చనిపోయినట్లు వచ్చినప్పటికీ.. వారి మరణాల వెనుక రహస్యమేదో దాగి ఉందని స్థానికులు భయాందోళలను వ్యక్తం చేస్తున్నారు.
‘గదిలోకి వారు బలవంతంగా ప్రవేశించినట్లు కానీ, తోసినట్లు కానీ శరీరంపై గాయం గుర్తులు లేవు. వారి మరణాలలో నేర కోణం కూడా లేదు. అయితే గుండె పోటుతో ఒకేసారి ఇద్దరు చనిపోవడం మాత్రం ఆందోళన కలిగించే అంశం’ కైసర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భార్యాభర్తలిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ జంటకు ఇంతకు ముందు గుండె సంబంధిత సమస్యల ఉన్న దాఖలాలు లేవు. దంపతుల మరణాల వెనుక మిస్టరీని ఛేదించేందుకు లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో తదుపరి పరీక్షల కోసం ఇద్దరి శరీరాల లోపలి భాగాలను భద్రపరిచారు. అయితే వరుడు గ్రామంలో భారీ జనసందోహం మధ్య నవ దంపతులకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు.