గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. గాంధీలో కిడ్నీ సమస్యతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి భార్య, మరదలిపై అత్యాచారం, తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన పూటకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దాదాపు నాలుగు రోజులు ఉరుకులు పరుగులు పెట్టి కేసును ఓ దారికి తెచ్చారు. వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమనీ, చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజ్, వైద్యుల నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని వెల్లడించారు. చిత్త భ్రమలకు లోనయ్యే మహిళలు అత్యాచార ఆరోపణలు చేసినట్లు తెలిపారు. మత్తు ప్రయోగం, అత్యాచారం జరగలేదని నిర్ధారించారు.
ఐదురోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు మహిళలు కల్లు బానిసలు. ఐదు రోజులపాటు కల్లు తాగకపోవడంతో మహిళలో విత్‌డ్రాయల్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో, రోగిని గాంధీలోనే వదిలేసి అక్కవెళ్లిపోయింది. ఆగస్టు 12, 14 తేదీల్లో చెల్లెలు సెక్యూరిటీ గార్డుతో సన్నిహతంగా మెలిగింది. ఎక్కడా అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు విషయంలో మహబూబ్‌నగర్ వెళ్లిన పోలీసులకు అసలు నిజాలు తెలిశాయి. అక్కా చెల్లెళ్లకు ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సింటమ్స్ ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ సమాచారంతో అసలు కథ బయటపడింది.
భర్తను ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిన మహిళను నారాయణగూడలో ఓ మెడికల్ షాప్ వద్ద పోలీసులు గుర్తించారు. మహిళకు భరోసా కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసలు గాంధీకి వచ్చినప్పటి నుంచి ఏం జరిగందనే దానిపై పోలీసులు సమాచారం రాబట్టారు.