ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా… తమనీ అలాగే పట్టుకోలేరని ఇంట్లో పిల్లలే తల్లి బంగారాన్నీ, వెండినీ కాజేసారు. తిరిగి చోరీ కేసు పెట్టారు ఇంటి దొంగలే కన్నతల్లి చికిత్సకు డబ్బులు లేక ఆమె నగలనే ఆమెకు తెలియకుండా ఇంటి దొంగలే చోరీ చేశారు. ఇంట్లో ఎవరో దొంగలు పడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు వారు నటించారు. అందరినీ నమ్మించ డానికి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేశవనగర్‌కు చెందిన కుందనపల్లి అనసూయకు ఆమెకు ఇద్దరు కొడుకులు సుధాకర్, ప్రభాకర్, నాగలక్ష్మి అనే కూతురు ఉంది. అనసూయ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు వారి వద్ద డబ్బులు లేవు. దాంతో వారు పథకం పన్ని తల్లి వద్ద ఉన్న బంగారం, వెండి, నగదు చోరీ చేసి, వాటిలో కొంత ఆమె చికిత్సకోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆరునెలల క్రితం తల్లి కళ్లుగప్పి 27 తులాల బంగారం, 1.3కేజీల వెండి, రూ. 1.88 లక్షల నగదు చోరీ చేశారు. వాటిలో నగదును ఆమె ట్రీట్‌మెంట్‌కు ఖర్చు చేశారు. ఈ నెల ఐదున తల్లి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను పెద్దకొడుకు సుధాకర్ ఇంటికి తీసుకెళ్లారు. ఇదే అదనుగా భావించిన కొడుకులు, కూతురు తల్లి ఇంట్లో ఉన్న మొత్తం బంగారం కాజేయాలని పథకం వేశారు. చిన్నకొడుకు ప్రభాకర్ తల్లి ఇంటికి వెళ్లి తాళాలు పగులగొట్టి 23.5 తులాల బంగారం, నాలుగు కేజీల వెండిని చోరీ చేశారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ కూతురు నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా ఇంటి దొంగల గుట్టు రట్టయింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.