హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నేరేడ్ మెట్ పరిధిలోని ఓ ఇంట్లోని పిల్లిని కొందరు దుండగులు దొంగిలించి కోసుకుని తిన్నారు. తాాజాగా ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. జీకే కాలనీలో ఉండే ఓ మహిళ ఇంట్లో ఇష్టంగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే ఆమె పెంచుకుంటున్న పిల్లి జనవరి 29 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ ఇంటి పక్కన ఇళ్లలో వెతికారు. కానీ, ఆ పిల్లి మాత్రం కనిపించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ.. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే అందులో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి ఆ పిల్లిని ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
అనంతరం ఆ మహిళ వెంటనే నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా వినాయక్ నగర్ కు చెందిన నర్సింహ, శంకర్, కిరణ్ లను నిందితులుగా గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసుల విచారణలో.. ఆహారం కోసమే ఆ పిల్లిని దొంగిలించామని, ఆ తర్వాత కోసుకుని తిన్నామని నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. పిల్లిని దొంగిలించి కోసుకుని తిన్న ఈ దుండగుల తీరుపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.