ప్రతి ఆడపిల్ల పెళ్లయ్యాక.. పుట్టింటిని వదిలి మెట్టినింట్లో అడుగుపెట్టక తప్పదు. అలా అడుగుపెట్టే ప్రతి ఆడబిడ్డ.. చిన్ననాటి నుంచి తన తల్లిదండ్రులతో తన ప్రయాణం ఎలా సాగిందో.. అత్తవారింట్లో కూడా అలానే సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కంటుంది. కానీ కొందరి ఆడపిల్లల జీవితాల్లో ఆ కలలు.. కలలుగానే మిగిలిపోతున్నాయి. అదనపు కట్నం కోసం, ఆడపిల్లను కన్నదనే సాకుతో కోడలిపై అత్తారింట్లో వేధింపులు సమాజంలో నానాటికి పెరుగుతున్నాయి. వీరికి కట్టుకున్న భర్త కూడా వత్తాసు పలుకుతుండడంతో.. వారు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక, పుట్టింటి వారికి భారం కాలేక మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నెల్లూరు లో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా, మల్కిపురం మండలం, తూర్పుపాళెం గ్రామానికి చెందిన చిక్కా క్రిష్ణ నరసింహారావు (39), పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పోతవరం గ్రామానికి చెందిన దుర్గా భవాని(29)ని 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. నరసింహారావు రైల్వే పోలీస్ కానిస్టేబుల్ గా నెల్లూరు జిల్లా బిట్రగుంటలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు, పిల్లలు కలిసి కావలిలోని రామ్మూర్తి పేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. పదేళ్ల వీరి సంసారంలో ఎన్నో కలహాలు వచ్చినా.. భవాని సర్దుకుపోతూ భారాన్ని నెట్టుకొచ్చింది. అయితే.. ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా భవాని మదిని తట్టిని ఆలోచన ఆ కుటుంబాన్ని అనుకోని విషాదంలోకి నెట్టింది.
ఇది కూడా చదవండి: Shantabai: ఈ భార్య వక్రబుద్ది వాళ్ళ కాపురాన్ని కూల్చేసింది! అంతా భర్తకి తెలిసే..!
మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దుర్గా భవాని ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుర్గా భవాని తల్లిదండ్రులు మాత్రం తమ అల్లుడి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. దుర్గా భవాని ఆత్మహత్యతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.