నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతంగా మారి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఇస్కపల్లిపాళెం గ్రామానికి చెందిన ఆవుల మురళి (25) అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన స్వాతి (22)తో ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. సాఫీగా సాగుతున్న కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఇక పుట్టిన కూతురితో భార్యాభర్తలు మురిసిపోతూ సంతోషమైన కాపురాన్ని నెట్టుకొస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే భర్త మృగంలా మారి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంతటితో ఆగకుండా పాప నాకు పుట్టలేదంటూ భార్యను రోజూ వేధింపులకు గురి చేసేవాడు. అలా కొన్ని రోజుల వరకు వీరి గొడవలు ముందుకెళ్తునే ఉన్నాయి. ఇక భర్త వేధింపులకు అత్తింటివాళ్లు సైతం వత్తాసు పలకడంతో వేధింపులు శృతిమించాయి. అయితే తొలి కాన్పు నిమిత్తం పుట్టింటికి వెళ్లిన స్వాతి ఈ గురువారం తిరిగి అత్తింటికి వచ్చింది. రాగానే గొడవలు మళ్లీ మొదటికొచ్చాయి. కాగా ఈ శనివారం భార్యాభర్తలు తిని పడుకున్నారు.
అయితే తెల్లవారు జామున నిద్రలేచిన భర్త.. భార్యను, 5 నెలల పాపను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఇక అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇలా అనుమానం పెంచుకున్న భర్త క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుని తాను ఆత్మహత్య చేసుకున్నదే కాకుండా అన్యాయంగా భార్య, కూతురు ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? అసలు ఇలాంటి దుర్మార్గులు చేస్తున్న దారుణాలకు ఎలాంటి శిక్ష విధించాలి? ప్రభుత్వాలు ఏమైన చర్యలు తీసుకోవాలా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.