నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన ఏడాదిన్నర చిన్నారి మిస్సింగ్ ఘటనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారిని చంపింది ఎవరో కాదని, తల్లి అనూషనే అంటూ పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
నెల్లూరు జిల్లాలోని గుర్రాలమడుగు సంఘంలో ఏడాదిన్నర చిన్నారి హారిక మిస్సింగ్ ఘటన స్థానికంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నుంచి చిన్నారి హారిక కనిపించకుండాపోయింది. వెంటనే ఆ చిన్నారి తల్లి అనూష భర్త, అత్తింటివాళ్లకు సమాచారం అందించింది. దీంతో అందరూ అంతటా వెతికారు. కానీ, ఆ చిన్నారి ఆచూకి మాత్రం కనిపించలేదు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా… బుధవారం ఉదయం చిన్నారి హారిక సర్వేపల్లి కాలువలో శవమై తేలింది.
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలిక మృతదేయాన్నిబయటకు తీశారు. ఈ సమాచారం అందుకున్న ఆ చిన్నారి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే పోలీసుల తాజా విచారణలో మాత్రం దిమ్మతిరిగే నిజం బయటపడింది. చిన్నారి హారికను హత్య చేసింది ఏవరో కాదని, ఆమె తల్లి అనూషానే అంటూ పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టినట్లు తెలుస్తుంది.
వెంటనే పోలీసులు ఆ చిన్నారి తల్లి అనూషను అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అనూష భర్త మణికంఠ, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కూతురిని చంపి ఎంత నాటకం అడిందంటూ అత్తింటివాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం అర్థరాత్రి ఊయలలో నిద్రపోయిన ఆ చిన్నారి సోమవారం ఉదయం కల్లా కనిపించకుండాపోయి చివరికి స్థానికంగా ఉన్న సర్వేపల్లి కాలువలో శవమై తేలింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.